ఇటీవల ప్రకటించినట్లుగానే ప్రముఖ నటుడు నాగార్జున తన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని తీసుకుంటున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్ కు అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవి దత్తతకు నాగార్జున ముందకు రావటాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్ కే ఉందని, రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్దరణ చేయటం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తమ వంతు ప్రయత్నం చేస్తుందని సంతోష్ అన్నారు. దీనికోసం సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. (ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఇప్పటికే మూడు ప్రాంతాల్లో అటవీ బ్లాక్ ల దత్తత జరిగింది. ప్రసుత్తం నాగార్జున తీసుకున్నది నాల్గవ బ్లాక్. మూడు ప్రాంతాల్లో ఇప్పటికే పార్కుల అభివృద్దితో పాటు, అటవీ ప్రాంతం స్థిరీకరణ, పునరుద్దరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎం.పీ సంతోష్ స్వయంగా కీసర అటవీ ప్రాంతంలో 2,042 ఎకరాలను దత్తత తీసుకుని ఎకో పార్కును అభివృద్ది చేస్తున్నారు. హీరో ప్రభాస్ ఖాజీపల్లి అటవీ ప్రాంతంలో 1650 ఎకరాలను, ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ నర్సాపూర్ రోడ్ లో మంబాపూర్ అటవీ ప్రాంతంలో 2,543 ఎకరాలను దత్తత తీసుకుని పర్యావరణహితంగా అభివృద్ది చేస్తున్నారు.)