మేము ఎందులో తక్కువ కామని మహిళగా తాను చెప్పాలనుకున్నది ఈ రకంగా చెప్పినట్టా.. ఏంటి ?
కవిత అంటే తెలంగాణ జాగృతి, కవిత అంటే బతుకమ్మ.. ఇలా కవిత అంటే మహిళా బిల్లు.. కవితను అరెస్టు చేయడం అంటే ఏకంగా తెలంగాణ మహిళా లోకాన్ని అరెస్టు చేసినంత పని… అని అంటారు కొందరు.. కవిత గురించి ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి గురించి తెలుసుకుందామని ఒక సారి నమస్తే తెలంగాణ పత్రికలో చదివా.. దాన్ని బట్టీ చూస్తే ఉద్యమంలో\ రాజకీయాల్లో తెలంగాణ మహిళల పాత్ర బాగా తక్కువగా ఉందని గ్రహించిన కవితమ్మ.. అమెరికా నుంచి హైదరాబాద్ సరాసరి వచ్చి.. ఇక్కడ తన తండ్రి ఇలా చేయి అలా చేయి అని చేయి పట్టి నడిపించకపోయినా.. ఒక్కోసారి ఉద్యమ అవసరాల దృష్ట్ట్యా తమ ఇంట్లోనే ఉండి పోయే.. తెలంగాణ పిత ప్రొ. జయశంకర్ ద్వారా మరింతగా ఉద్యమ పాఠాలను తెలుసుకున్న కవిత.. తర్వాత తర్వాత తనలాంటి ఎందరో మహిళామణులకంటూ ఒక దశా- దిశ చూపించి.. తద్వారా వారిని కూడా ఉద్యమంలోకి తీసుకురావాలన్న తలంపుతో.. తెలంగాణ జాగృతి అని పెట్టడమొక చారిత్రక ఘట్టంగా నాకు తెలిసింది.
ఇప్పుడు కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేయడం వంటివి చూస్తుంటే.. మహిళలు తలుచుకుంటే స్కీములకు మాత్రమే కాదు.. స్కాములకూ సమాన అర్హులే.. ఏం మగాళ్లేనా.. ఆడోళ్లు తలుచుకుంటే.. ఇలాంటి స్కాముల్లో పార్టిసిపేట్ చేయలేరా? అని చెప్పడం మాత్రమే కాదు చేసి చూపించగలరని నిరూపించారనిపించారామె. ఇక కవిత పతనం ఎలా మొదలైందని చూస్తే.. పసుపు రైతులు కక్షగట్టడం ద్వారా ఆమె నిజామాబాద్ లో అరవింద్ పై ఓడిపోయారు. ఆపై తన తండ్రికున్న రాజకీయ అధికారమంతా ఉపయోగించి.. ఎలాగోలా ఎమ్మెల్సీ పదవి పొంది.. తద్వారా కుదుట పడ్డ జాగృతమ్మ.. సారీ కవితమ్మ.. తర్వాతి కాలంలో.. అసలు మనం రాజకీయాల్లో ఎందుకున్నాం.. మనవాళ్లంతా తలా ఒక చేయి వేస్తుంటే మనం మాత్రం ఎందుకు వేయకూడదని ఆలోచించారేమో. (మన వాళ్లు ఎవరు?, వాళ్లు వేసిన చేయి ఏంటని నన్ను టూ డీటైలింగా అడక్కండి ప్లీజ్.. చాలా మంది మనోభావాలు దెబ్బ తింటాయ్) రామచంద్ర పిళ్లై ని తన బినామీగా పెట్టుకుని(ఇక్కడా ఒక మహిళకు మగ పురుషుడి అవసరం ఏర్పడిందా? అని మీకనిపించవచ్చు) బుచ్చిబాబు ద్వారా.. (మరో పురుషుడి సహకారం) పద్యంలాంటి పేరున్న ఆమె మద్యం స్కామ్ లో ఇరుక్కున్నారని టానిక్ బార్ టైమింగ్ అంత రైమింగ్ లో వినిపిస్తోన్న పబ్లిక్ టాక్.
సౌత్ సిండికేట్ లో మరో ఇద్దరితో కలసి(వీరు మగవారే).. జాగృతి మహిళ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలా చాలా క్లోజ్డ్ సర్క్యూట్ లో ఇన్ వాల్వ్ అయ్యారన్నది మహేంద్రు వంటి వారు విచారణలో వాకృచ్చిన విధం.. మనకంతా తెలిసిందే. ఇక్కడ మనకు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే.. ఎంతో క్లారిటీగా.. పిచ్చ క్లారిటీగా మాట్లాడుకుంటే.. ఆమె తన చేతికి కట్టుకున్న 20 లక్షల వాచీలోని గడియారం చూపించే టైమంత స్పష్టంగా.. చర్చించుకుంటే.. ఫస్ట్ ఆఫ్ ఆల్.. ఇవి రాజకీయాలు. ఇక్కడ పాలిటిక్స్ ఇలాగే చేస్తారు బయ్. ఏం.. కేజ్రీవాల్ ఇరుక్కోలేదా? ఆయన అనగా ఎవరు? ఐఏఎస్ స్థాయి అధికారి. అంతేనా.. అవినీతి మీద తీవ్ర స్థాయిలో పోరాడిన వాడు. అసలు ఈ ఉదంతం చెప్పే నీతి ఏంటంటే… అప్పుడెప్పుడో నేను మద్య పాన నిషేధం మీద మందు కొడుతూ.. ఆ వార్తలు రాసేవారు జర్నలిస్టులు అంటే నమ్మక పోయేవాడ్ని.. కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది.
అసలు కేజ్రీవాల్ ఏంటి? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? ఆయన సింప్లిసిటీకి ఎంత పేరుంది.. ఒక సీఎం అయి ఉండి కూడా.. సాదా సీదా వ్యక్తి లాగా ఢిల్లీ నడి వీధుల్లో తలకు మఫ్లర్ చుట్టుకుని మరీ జాగింగ్ కి వెళ్లేవాడే.. అలాంటోడు.. మళ్లీ ఇంకో ఆయనెవరూ.. అన్నా హజారే వంటి మచ్చలేని నీతిమంతుడైన వ్యక్తితో కలిసి.. పోరాటాలు చేసినోడు గాదా.. అట్టాంటోడు అయి ఉండి.. ఇట్టాంటి మకిలి అంటించుకున్నాడే.. అలాంటిది కవితక్క ఈ మాత్రం రొచ్చులో చిక్కితే మాత్రం తప్పేముందీ??? అని మనకు మనం ఎందుకు సర్దిపుచ్చుకోకూడదు. ఏ.. తమిళనాడుకు మాత్రమే.. ఒక కనిమొళి ఉండాలా? మన తెలుగు రాష్ట్రాల్లో ఆ మాత్రం కేరెక్టరైజేషన్ ఉంటే మాత్రం తప్పేంటట.. ఒకే బాబా… కవితను ఆ గాట కట్టేసినట్టేనా? అంటే ఇంత జరిగాక కూడా అక్కడ తప్పు జరిగి ఉండదన్న గ్యారంటీ ఎక్కడైనా ఉందా? అని ఒక క్లారిటీ అంటూ వచ్చేశాక.. జస్ట్ అలా అనేయాలనిపించింది.. ఏమనుకోకండే.
ఇగ.. కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ అన్నట్టు మొన్ననే అరెస్టు కావల్సుండే. గనీ, అప్పట్లో బీఆర్ఎస్ పవర్ లో ఉండటం.. దానికి తోడు.. వాళ్ల దగ్గర ఆర్ఎస్ఎస్ కీలక నాయకుడు బీఎల్ సంతోష్ కుమార్.. ని సైతం మెడలు వంచగల ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అన్నదొకటి అడ్డు తగలడంతో.. బీజేపీ ప్రాతివత్యం నిరూపించుకోడానికి చాలానే తంటాలు పడాల్సి వచ్చింది. కవితక్కను కస్టడీలోకి తీస్కోడానికి కావల్సినంత హార్డిల్స్ ఎదుర్కోవల్సిన సిట్యువేషన్ వచ్చి పడింది. ఇప్పుడు చూడండి.. ఇటు కవితక్కను అరెస్టు చేయడంతో పాటు.. అటు ఒక సీఎం అయిన కేజ్రీవాల్ ని సైతం అరెస్టు చేసి… తుక్కు రేగ్గొట్టేసింది బీజేపీ కేంద్ర నాయకత్వం. అంటే ఒక్క దెబ్బకు- రెండు పార్టీలన్నట్టు. ఇటు ఢిల్లీతో పాటు పంజాబ్.. ఆనక, దేశ వ్యాప్తంగా జూనియర్ కాంగ్రెస్ గా పేరు సాధిస్తూ దూసుకొస్తోన్న ఆమ్ ఆద్మీని గట్టి దెబ్బ తీయడంతో పాటు… బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని, దేశ వ్యాప్త రాజకీయాలకు తెరలేపిన టీఆర్ఎస్ కూ.. గట్టిగా ఇచ్చి పడేసింది.. కాకలు దీరిన కమలదళం.
నిన్న మొన్న ఎవరో అన్నట్టు.. కవితక్క ఎంచక్కా.. బీజేపీలోకి వెళ్లి పోయి.. వాషింగ్ పౌడర్ నిర్మా.. అవినీతి మరకలు కూర్మా.. అని దెబ్బకు వదిలించేసుకోవచ్చు.. కానీ ఆమె అలా చేయక పోవడంలోనూ తెలంగాణ ఆడబిడ్డ ఆత్మగౌరవం దాగి ఉందని మనం ఎంతో గొప్పగా ఎందుకు అభివర్ణించుకోవద్దు. చాల్ చాల్లెండి.. జయలలిత చేస్తే ఒక నీతి- కవితక్క చేస్తే మరొక అవినీతా? అని మీరడగ వచ్చు.. మా కవితక్కకు మాత్రం.. ఏం తక్కువ? అయినా రాజకీయాలంటే ఇలాక్కాదూ చేసేది? ఇలాగే చేస్తారు.. ఇలాగే చేస్తారంతే.. అయినా ఈ జాగృతీ జామకాయ.. కవితక్క కాకరకాయ అంటూ.. ఓ బోనాలెత్తి.. బతుకమ్మలాడాలంటే.. ఎంత ఖర్చు.. మొన్నంటే మొన్న చూడండి.. తమిళమా మలయాళమా క్లియర్ గా తెలియని.. గౌతమ్ వాసుదేవ మీనన్ అనే డైరెక్టర్ ద్వారా ఆమె బతుకమ్మ పాట చేయించలేదూ.. కోట్లు ధారబోసి… ఈ డబ్బులన్నీ ఏడకెల్లి వచ్చినయ్??? ఇట్టాంటివేవో చేస్తే గాదూ..(అంటారింకొందరు కొంటె కోణంగులు.. ఉష్షూ.. ఆపండి బాబోయ్.. మీరూ మీ వెటకారాలు).
అద్దె ఇంటి నుంచి బంగళాలకు మారాలంటే ఆ మాత్రం తప్పదమ్మా.. అనే అభిమానులకేం కొదవ లేదు.. నాకు తెలిసి.. మీ అక్కచెల్లెలు చేరినా, పోనీ మా అప్పచెల్లెలు చేరినా.. రాజకీయాలంటే రాజకీయాలే. వాటిలో చిక్కితే.. ఈ మాత్రం స్కామో గీమో చేసి చేతులు కాల్చుకోవల్సిందే.. అయినా నాకింకో డౌటు.. జయలలిత ఇలాగే స్కాముల్లో చిక్కితే తమిళ మహిళలు ఏమనేవారో తెలుసా? ఆమె హీరోయినండీ.. ఆమెకా మాత్రం పట్టు చీరలు, నగలు, ఆస్తులు, అంతస్తులు, చెప్పులు ఉంటాయండీ.. ఆమె నీతి చేసిందా? అవినీతి చేసిందా?? మాకనవసరం.. మేం ఆమెను పురచ్చితలైవిగా ఎప్పుడో నచ్చి చచ్చాం.. ఆమె ఎన్నేసి పుచ్చు పనులు చేసినా సరే సర్దుకు పోతాం.. పోతూనే ఉంటాం.. అని తెగేసి చెప్పి.. ఆమె మీద ఎన్నేసి అవినీతి మరకలున్నా సరే.. గుద్దిన ఓటు గుద్దకుండా గుద్ది.. ఆమెకు విజయాల మీద విజయాలిచ్చారు తమిళ మహిళా మణులు.
మరి కవితక్కను మాత్రం అంత సునిశితపరిశీలన చేస్తారెందుకుని??? అయినా ఇక్కడెవరు పెద్ద పతీత్తుల్లేరు.. ఇవాళ కవిత.. రేపు ఇంకో సవిత. మహిళలంటూ ఒక జాగృతి తెచ్చుకున్నాక ఆ మాత్రం.. స్కామూలు స్కీముల్లో తమ పాత్ర ఉండేలా చేసుకోకుంటే ఎలా ? ఏం రో.. పిచ్చిగిచ్చిగనీ లేచిందా ఏంది??? అనంటారేమో.. కుల్లం కుల్ల మాట్లాడుకుంటే.. నాకు కవిత ఇలా కాకుండా మరోలా చేసి ఉంటే కూడా నచ్చేది కాదు. రాజకీయాలన్నాక బరాబర్ గిట్లనే జెయ్యాల. అదంతే రూలు. ఏం ఏపీలో చంద్రబాబు 2014- 19 మధ్య కాలంలో 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని స్వయానా ఆయన సామాజిక వర్గపు రేణువు.. రేణుక పోతినేని గట్టి రిపోర్టే ఇవ్వలేదూ.. ఇదీ అంతే.
ఇక జగన్ మోహన రెడ్డి నుంచి మొదలు పెడితే.. ఈ రాజకీయ వరదా కాలంలో.. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు. ఈ గుడ్ టైమ్ నుంచి ఆ బ్యాడ్ టైమ్ కి కప్పదాట్లు దాటే వాళ్ల కాలికి.. ఆ మాత్రం మకిలి అంటకుండా ఉంటుందా అంట… అన్నీ అవుతయి తీ…!!! చంద్రయాన్ విజయంలో కొంగు నడుముకు బిగించిన ఎందరో వీర నారీమణులు ఎలాగో.. ఇలాంటి పురుషాధిక్య అవినీతి అనే భూభాగంలోకి ఒక మహిళగా.. మా కవితక్క అడుగుబెట్టి.. సెబ్బాచ్.. మనకూ ఈ కేటగిరిలో ఒక మహిళా మణి ఉందని సంకలు గుద్దుకోక.. ఏంటయా.. మీ దిగులు విచారమూనూ..
సివరాఖరుగా… అయినా బాగా సూడండి.. గట్టిగా ఆలోసింసి.. సింసి.. సూడండీ.. ప్రతి మగాడి ఇజియం ఎనక ఒక ఇస్త్రీ ఉన్నట్టు.. ప్రతి ఆడదాని అవినీతి ఎనక.. ఎందరో మగాళ్లున్నరు.. ఆళ్ల మాటేంటని.. ఆలోసింసక ఏంటండీ మీరూ.. మీ చాదస్తాలూనీ…!!!
ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది