భారీ బరాజ్‌లు.. వాటిని మించిన సంకల్పాలు.. మహోన్నత లక్ష్యాలు! వీటన్నింటి కలబోతగా చరిత్రాత్మక కట్టడంగా నిలిచి.. రైతన్న కన్నీరు తుడిచే మానవాద్భుతం ఆ ప్రాజెక్టు!రైతుల ఈతి బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇంజినీర్ అవతారమెత్తి.. మెదడు రంగరించి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యవసాయిక యజ్ఞ ఫలం అది! అధ్యయన నమూనాగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో కేంద్ర జలసంఘం అధికారులతోపాటు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. తాజాగా మహారాష్ట్ర ఇంజినీర్ల బృందం అద్భుత కట్టడాన్ని చూసి అచ్చెరువొందింది!
ఒకప్పుడు గుక్కెడు నీళ్ల కోసం గుక్కపట్టి.. నీళ్లో రామచంద్రా! అంటూ దాహార్తితో తల్లడిల్లిన తెలంగాణ ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు జలపాఠాలు బోధిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు యావత్తు దేశానికే ఒక ఆదర్శనీయ నమూనాగా సాక్షాత్కరిస్తున్నది. దీని నిర్మాణ పద్ధతి, వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఎందరెందరికో అధ్యయనాంశాలుగా మారుతున్నాయి. మహారాష్ట్ర నీటి వనరులశాఖ ఇంజినీర్ల బృందం ఈ ప్రాజెక్టును సందర్శించడం, దీనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడం, ఇక్కడి నిర్మాణ పద్ధతులను తమ రాష్ట్రంలోనూ అనుసరిస్తామని ప్రకటించడమే ఇందుకు తాజా నిదర్శనం.
మహారాష్ట్ర నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ అనిల్ బహుదూరె నేతృత్వంలో 15 మంది ఇంజినీర్ల బృందం శని, ఆదివారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి, నిర్మాణ రీతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన లక్ష్మీబరాజ్ నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్, మానవ నిర్మిత జలాశయం మల్లన్నసాగర్ వరకు ప్రతి అంశాన్నీ లోతుగా పరిశీలించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌లు, బరాజ్‌లను సందర్శించింది. వీటికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నది.
ఈ బృందానికి రామగుండం నీటి పారుదలశాఖ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు లిఫ్ట్ ద్వారా నీటి ఎత్తిపోతలు, బరాజ్‌ల నిర్మాణం, ఇంజినీరింగ్ అధికారుల నైపుణ్యం గురించి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా అనిల్ బహుదూరె మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వల్ల సత్ఫలితాలు వచ్చినందున, ఇక్కడి విధానాన్ని మహారాష్ట్రలోనూ అనుసరిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని కితాబిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు సాగు నీరందించాలనే గొప్ప ఆశయంతో భారీ వ్యయంతో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మించిందని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నదని కొనియడారు. సాగు, తాగునీటి రంగాలకు నీటిని మళ్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్ల పనితీరు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నదని ప్రశంసించారు. అంతకుముందు ఆయన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. ఈ బృందంలో మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ సీఈలు ఏఎన్ బహదూర్, ఏఎల్ పతాక్, పీజీ మందదె, ఎస్‌ఎం బెల్‌సరె, ఎస్‌ఈలు ఏటీ దేవ్‌గాడె, ఆర్‌ఎస్ దేశ్‌ముఖ్, ఎస్‌వీ చౌదరి, ఈఈలు ఎస్‌పీ అడె, ఎస్‌వీ హొజారె, ఏఏ సవంత్, ఎస్‌ఎస్ మున్నోలి, వీవీ బాగుల్, ఎస్‌జీ రాతి, ప్రణతి గోట్‌మారె, అరుణ్ నాయక్ వాడె తదితరులు ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సత్ఫలితాలు వచ్చినందున, ఇక్కడి విధానాన్ని మహారాష్ట్రలోనూ అనుసరిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సాగు నీరందించాలనే గొప్ప ఆశయంతో భారీ వ్యయంతో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇక్కడి ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. సాగు, తాగునీటి రంగాలకు నీటిని మళ్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్ల పనితీరు ఎంతో ఆదర్శవంతం.
• అనిల్ బహుదూరె, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ సీఈ
అదో అద్భుత జల సంకల్పం
——————–
కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుత కుడ్యం. ఇంతపెద్ద ప్రాజెక్టును అతి స్వల్ప కాలంలోనే నిర్మించడం గొప్ప విషయం. ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడమంటే వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అటవీ, రెవెన్యూ, విద్యుత్తు లాంటి శాఖలన్నింటినీ ఏకకాలంలో సమన్వయం చేసుకొని, మూడేండ్లలోనే నిర్మించడమంటే మాటలు కాదు. ఎంతో గొప్ప సంకల్పం, సమర్థుడైన నాయకుడు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. తెలంగాణ సర్కారు జల సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు.
• మహారాష్ట్ర జలవనరులశాఖ , చీఫ్ ఇంజినీర్ సంజయ్ బల్సారే