Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకి మరింత వేడెక్కుతున్నాయి. 2024 ఎన్నికలే టార్గెట్ గా అన్నే రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి … వారు ప్రజల్లోకి తీసుకెళ్లిన నినాదం ‘ ఒక్క ఛాన్స్ ‘. ఈ స్లోగన్తో వైఎస్ జగన్కు ఒక అవకాశం ఇద్దాము అనుకునే ప్రజలు విజయాన్ని అందించారు. ఇప్పుడు అదే నినాదాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భుజానికెత్తుకున్నారు.
ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పవన్ సరికొత్త నినాదంతో ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన జనసేనాని… 2024 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించేందుకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నారు. అవినీతి రహిత, ప్రజాస్వామ్యం, నిజాయితీ పాలన ఎలా ఉంటుందో చూపుతాను అని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆపబోమని… పేదల ప్రయోజనం కోసం మరికొన్ని పథకాలను తీసుకొస్తామన్నారు. ప్రజాధనాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వృధా చేయబోమని… ప్రభుత్వ నిధుల్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తామన్నారు.
అలానే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో… ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా విజ్ఞప్తి. రానున్న ఎన్నికల్లో ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇవ్వండి. మీ, మీ బిడ్డల భవిష్యత్తులో మార్పు తీసుకొచ్చేందుకు జనసేన పనిచేస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… అవినీతి లేని పాలన ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను… నా కోసం అడగట్లేదు’అంటూ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసింది. పవన్ కళ్యాణ్ కొత్త నినాదం ఒక్క ఛాన్స్ సోషల్ మీడియా లోనూ చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ ఒక్క ఛాన్స్ నినాదం ఈ మేరకు ప్రజల్లోకి వెళుతుందో చూడాలంటే కొన్ని నెలలు ఆగక తప్పదు.