తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకుడు మహమ్మద్ ముస్తాఫాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావుగౌడ్ ఆదివారం ఖరారు చేశారు. జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మెట్టు గూడలో ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో ముస్తాఫా అంతకు ముందు జై స్వరాజ్ పార్టీలో తన అనుచరులతో చేరారు.
ముఫ్ఫై ఏళ్ళకు పైగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న ముస్తాఫా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి వాస్తవ్యుడు. గ్రామ స్థాయి నుంచి జాతీయ రాజకీయాల వరకు ప్రత్యక్ష అనుభవం ఉన్న ముస్తాఫా జై స్వరాజ్ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ దూరదృష్టికి ఆకర్షితుడై పార్టీలో చేరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వివిధ కాంట్రాక్టులు చేస్తున్న ముస్తాఫా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జై స్వరాజ్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో కాసాని పార్టీ కమిటీతో చర్చించి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
ఈ సందర్భంగా కాసాని శ్రీనివాసరావు గౌడ్ మాట్లాడుతూ… ముస్తాఫా జహీరాబాద్ నుంచి గెలిపే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో జై స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుందని, అదే విధంగా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పల్లె పల్లెన జై స్వరాజ్ పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టానని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి దుంబాల పరష రాములు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు వివిధ వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్ పేర్కొన్నారు. తనకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావుగౌడ్ తో పాటు పార్టీ నాయకులకు ముస్తాఫా దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు మహమ్మద్ ఉస్మాన్, పార్టీ సలహాదారుడు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.