T20 World Cup : టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా మరో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పొరాడి విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై అద్భుతంగా పుంజుకొని విజయం సాధించడంతో సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది టీమ్ ఇండియా. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్… బంగ్లాకు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వర్షం కురవడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించగా… లక్ష్యాన్ని 151 పరుగులకు సవరించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కాపాడిన భారత్ బౌలర్లు …
ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అశ్విన్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి రెండో పరుగు కోసం ప్రయత్నించి లిట్టన్ కుమార్ దాస్ రన్‌ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అద్భుతమైన త్రో విసిరి దాస్‌ను పెవీలియన్ పంపించాడు. ఈ ఔట్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. లిట్టన్ దాస్ 27 బంతుల్లోనే 60 పరుగులతో (7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా 13వ ఓవర్ రెండో బంతికి యాసిర్ అలీని, ఐదో బంతికి మొసాదిక్ హుస్సేన్‌ను పెవీలియన్‌కు పంపించాడు. ఈ ఓవర్ తర్వాత సమీకరణం 18 బంతుల్లో 43 పరుగులుగా మారింది. చివరి ఓవర్‌కు బంగ్లా విజయానికి 20 పరుగులు కావాల్సిన దశలో అర్ష్‌దీప్ సింగ్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్ కు విజయాన్ని అందించాడు.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాంటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ మరోసారి మంచి ప్రదర్శన చేశాడు. 44 బంతుల్లో 64 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్స్) చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అర్ధ శతకంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. (50; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు). వీరిద్దరూ కలిసి భారత స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30 పరుగులు, 4 ఫోర్లు), అశ్విన్ (6 బంతుల్లో 13 పరుగులు, 1 ఫోర్, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత్ మంచి స్కోరు చేయగలిగింది.