Bhakthi కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్ని ఉత్సవాలు జరిగినా ప్రతియట నిర్వహించే బ్రహ్మోత్సవాలకు మాత్రం పెద్దపీట వేస్తుంది టీటీడీ.. గత రెండేళ్లుగా కరోనా కారణాలతో భక్తులను అనుమతించని టీటీడీ.. ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు మాత్రం భారీ ఎత్తున భక్తులకు అనుమతిస్తుంది.
ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో తొమ్మిది రోజులు పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వీటిని ఘనంగా నిర్వహిస్తున్నారు. 88 సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు చూడటానికి ఎంతో మంది భక్తులు వస్తున్నారు.. ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ అంటే ఆదివారం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 27వ తేదీన ధ్వజారోహణం జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబైన గజరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు శ్రీవారు పెద్ద శేష వాహనంపై, రెండో రోజు చిన్న శేష వాహనంపై, అదే రోజు రాత్రి హంస వాహనంపై, మూడో రోజున సింహ వాహనంపై, ఆ రోజు రాత్రి ముత్యపు పందిరిలో, నాలుగో రోజున ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి సర్వ భూపాల వాహనంపై, ఐదో రోజున ఉదయం మోహినీ అవతారంలో, రాత్రి గరుడ వాహనంలో, ఆరో రోజున ఉదయం హనుమంతుని వాహనంలో, ఆ రోజు రాత్రి స్వర్ణ రథంపై, ఏడో రోజున సూర్య ప్రభ వాహనంలో, అదే రోజున సాయంత్రం చంద్రప్రభ వాహనంలో, ఎనిమిదో రోజున ఉదయం ఉభయ దేవేరులతో కలిసి తిరు వీధుల్లో విహరిస్తారు. రాత్రి అశ్వవాహనంపై వచ్చి శ్రీవారు భక్తులను కనువిందు చేస్తారు. చివరి రోజు చక్రస్నానం నిర్వహించి, సాయంత్ర శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు.