Political తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగకు హైదరాబాద్ మహానగరం ముస్తాబు అవుతోంది. పండగ ఏర్పాట్లపై బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ సలహాదారు, సీఎస్,డీజీపీలు కలిసి వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈనెల 25 నుంచి అక్టోబర్ 3వరకు బతుకమ్మ పండుగ ఉంటుందని ప్రకటించారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. పండగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరగాలని అన్నారు. సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్ 3న ట్యాంక్ బండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు.
ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని, బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. బతుకమ్మ పండగపై ఆకర్షణీయమైన డిజైన్‌లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని చెప్పారు. ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్వహణ కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఉండాలని, ఇలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఆదేశాలు జారీ చేశారు.