Bhakthi సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల ప్రత్యేకత ఎంతో ఉన్నతమైనది.. నిత్యం భక్తులతో పోటెత్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టు ఉంటుంది.. కోరిన కోరికలు తెచ్చే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి.. ఏడుకొండల పై నిలువైన ఆ స్వామి క్షేత్రాన్ని నిత్యం కొన్ని వేలమంది దర్శించి తరిస్తారు. నిత్య దానంతో తిరుమల వచ్చిన భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్నప్రసాదాలు విక్రయిస్తారు.. తిరుమక్షేత్రాన్ని చూడటానికి ఏటా కొన్ని లక్షల మంది తిరుమలకు వస్తూ ఉంటారు. ప్రస్తుతం కూడా తిరుపతిలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తుల తాకిడి ఎక్కువగా వుంది.
అయితే గత ఆగస్టులో తిరుమల శ్రీవారిని 22.22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా తొలిసారి ఒకే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.140.34 కోట్లు వచ్చింది. ఇదే ఏడాది జూలైలో కూడా తిరుమలలో రద్దీ ఎక్కువగానే ఉంది.. శ్రీ వారి హుండీ ఆదాయం రూ.139.45 కోట్లు వచ్చింది. అలాగే ముందు నెల మేలో రూ.130.50కోట్ల ఆదాయం వచ్చింది.
అయితే ఆగస్ట్ నెలలో 1.05 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగాయని టీటీడీ తెలిపింది. తిరుమలలో జరిగే నిత్య అన్నదానం కూడా ఎంతో ప్రసిద్ధి. రోజూ ఎన్నో వేల మంది ఈ ప్రసాదాన్ని అందుకుంటారు. ఇదే నెలలో తిరుమలలో మొత్తం 47.46 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. 10.85 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.