ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో 3డీ ప్రింటింగ్ ఒకటని, దీనికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ క్రమంలోనే దేశంలో 2026 నాటికి ఈ రంగంలో 65 బిలియన్ డాలర్ల (రూ.5 లక్షల కోట్లపైనే) వ్యాపారం జరిగేందుకు అవకాశం ఉన్నదని అంచనా వేశారు. శుక్రవారం హైటెక్స్‌లో ఏఎంటెక్ ఎక్స్‌పో (దేశంలోనే అతిపెద్ద ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్‌పో)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ ఎల్ రమాదేవీ కూడా భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో ఒకటిగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ప్రాచుర్యం పొందుతోందన్నారు.
దీనికున్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశోధన, అధ్యయన సంస్థను కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ పేరిట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటైందన్నారు. ఏడాది క్రితం తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ, కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ సెంటర్‌ను తెచ్చాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఒకటైన 3డీ ప్రింటింగ్‌లో వినూత్న ఆవిష్కరణలను ప్రొత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని వివరించారు. ఆర్థిక సహకారంతోపాటు, ఉత్పత్తుల డిజైన్‌కు పేటెంట్‌లు, దేశ-విదేశాల్లో మార్కెటింగ్‌కు కృషి చేస్తున్నామన్నారు.
ఏరోస్పేస్, డిఫెన్స్, వైద్య పరికరాల తయారీలో..
హైదరాబాద్ కేంద్రంగా ఇటీవలికాలంలో ఏరోస్పేస్, డిఫెన్స్, వైద్య పరికరాల తయారీ రంగం వేగంగా విస్తరిస్తున్నది. కొత్త ఆవిష్కరణలతోపాటు పలు పరిశ్రమలు తమ తయారీ కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటిలో తయారయ్యే ఉత్పత్తులను 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో నచ్చిన రీతిలో, మరింత నాణ్యతతో ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ రంగానికి ఉన్న భవిష్యత్తును గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహక కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.
ఈ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల రాష్ర్టానికేగాక దేశానికీ ప్రయోజనం చేకూరుతుందని, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీలో ప్రపంచంలో భారత్ గమ్యస్థానంగా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ఐటీ శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్‌లో 3డీ టెక్నాలజీకి ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. ఆ విభాగంలో సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తూ నూతన ఆవిష్కరణలు చేసేలా ప్రభుత్వం స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు. దీంతో రానున్న రోజుల్లో 3డీ ప్రింటింగ్ ఇండస్ట్రీకి హబ్‌గా హైదరాబాద్ మారేందుకు అవకాశం ఉందన్నారు.