కామెడీ చిత్రాలతో తనదైన శైలిలో నవ్వులు పంచిన హీరో అల్లరి నరేష్.. తన పంథా మార్చుకొని వస్తున్న ప్రయోగాత్మక చిత్రం ”నాంది’’. విజయ్ కనకమేడల దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. అల్లరి నరేశ్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన ‘నాంది’ ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని కలిగించింది. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ వస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
వినూత్నమైన కథ కథనాలతో రూపొందిన ‘నాంది’ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఇన్నాళ్లూ వెయిట్ చేసిన మేకర్స్.. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని వదిలారు. ఇందులో అల్లరి నరేష్ జైలు కూర్చొని తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. సిద్ జే సినిమాటోగ్రఫీ అందించారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేయగా.. రచయిత అబ్బూరి రవి సంభాషణలు అందించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ – నవమి – హరీష్ ఉత్తమన్ – ప్రియదర్శి – ప్రవీణ్ – దేవి ప్రసాద్ – వినయ్ వర్మ – నర్సింహారావు – శ్రీకాంత్ అయ్యంగార్ – రమేష్ రెడ్డి – చక్రపాణి – మణిచందన ప్రమోదిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.