Health Tips : ప్రస్తుత కాలంలో యువత ముఖ్యంగా తమ శరీరంపై ఎక్కువ మక్కువ పెంచుకుంటున్నారు. కండలు తిరిగిన దేహం కోసం జిమ్ లలో కష్టపడుతూ శరీరాన్ని ధృడంగా మార్చుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పొట్టిగా ఉన్నారని, ఎత్తు పెరగడం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా సహజంగానే ఎత్తును కొంతమేర పెంచుకోవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా చేయడం వల్ల సహజంగానే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే యోగాలో కొన్ని భంగిమలు శరీర ఎత్తును పెంచడంలో సహాయపడుతాయని అంటున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
పశ్చిమోత్తనాసనం : ముందుగా రెండు కాళ్లను వీలైనంత ముందుకు చాచి కూర్చోవాలి. నెమ్మదిగా ఊపిరి తీసుకుని ముందుకు వంగాలి. అలా వంగి కాలి వేళ్లను చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించాలి. వీపును నిటారుగా ఉంచాలి. వీలైనంత వరకు నుదుటిని మోకాళ్లకు తాకడానికి ప్రయత్నించాలి.
ధనుస్సు : ఈ ఆసనాన్ని ప్రారంభించేటప్పుడు ముందుగా నేలపై పడుకోవాలి. తర్వాత రెండు కాళ్లను వెనుక నుంచి పైకి లేపాలి. తర్వాత ముఖాన్ని పైకెత్తి వెనుక నుంచి రెండు చేతులతో పాదాన్ని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండాలి.
ఉష్ట్రాసనం : ఈ ఉష్ట్రాసనం శరీరాన్ని ఉత్కృష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ కాళ్ళను వెనుకకు విస్తరించి నేలపై మోకరిల్లి ప్రారంభించండి. ఉదరం ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉండనివ్వండి. తర్వాత రెండు చేతులను మీ తుంటిపై ఉంచి లోతైన శ్వాస తీసుకోండి. ఆ తరువాత అరచేతులను మీ కాళ్ళపై ఉంచి, నెమ్మదిగా వంగాలి. మీ తలను వెనుకకు వంచండి. 10 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.
వృక్షాసనం : పాదాలను కలిపి నిటారుగా నిలబడండి. ఆ తర్వాత చేతులను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మీ కుడి కాలును ఎడమ మోకాలి వైపుకు మడిచి, ఆపై ఎడమ కాలుపై నిలబడండి. మీ కుడి పాదం అరికాలు మీ ఎడమ తొడ లోపలి భాగాన్ని తాకాలి. ఇప్పుడు మీ చేతులను పైకెత్తి, మీ చేతులను నమస్కార స్థితిలో ఉంచండి. ఈ భంగిమను కొన్ని సెకన్లపాటు ఉంచాలి.
తడాసన : ముందుగా నిటారుగా నిలబడాలి. భుజాలు, మెడను సమలేఖనం చేయాలి. తర్వాత నెమ్మదిగా రెండు చేతులను పైకెత్తి లోతైన శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా కాలి మడమలను పైకి లేపి కాలి మీద నిలబడండి. మీ శరీరాన్ని వీలైనంత వరకు సాగదీయండి. మీ కాళ్ళు, చేతులను నిటారుగా ఉంచండి. ఈ భంగిమను చేయడం ద్వారా శరీర ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.