Health Tips : చలి కాలంలో అంటు వ్యాధుల ప్రమాదం అనేక రెట్లు పెరుగుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు తరచూ ఇబ్బందిపెడుతూ ఉంటాయి. అయితే రోగ నిరోధక శక్తి బాగా ఉంటే ఏ వ్యాధితో అయిన సులభంగా పోరాడవచ్చని అంటున్నారు డాక్టర్లు. శీతాకాలంలో మన రోగ నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా కొన్ని పండ్లను తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయని చెబుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
జామ : జామ కాయలో విటమిన్ సి మంచిగా లభిస్తుంది. ఇందులో ఉండే పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడతాయి. అలానే జామ పండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచేందుకు సహాయ పడుతుంది.
ఆరెంజ్ : రోగ నిరోధక శక్తిని పెంచడానికి నారింజ అత్యంత ప్రయోజనకరమైన పండు. ఈ కాయలో విటమిన్ సి మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ చలి కాలంలో రోజు ప్రారంభంలో రోజూ ఒక నారింజను తీసుకుంటే, అది రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయ పడుతుందని నిపుణులు అంటున్నారు. అలానే చర్మానికి మెరుపును తీసుకురావడానికి కూడా ఇది చాలా ఉపయోగకరమైన పండుగా సహాయపడుతుంది.
కివీ : చల్లని వాతావరణంలో విటమిన్ సికి అత్యంత అనుకూలమైన పండు కివి. ఇది విటమిన్ సి కి మంచి మూలంగా పరిగణించబడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని చాలా త్వరగా బలపరుస్తుంది. డెంగ్యూ వంటి వ్యాధులలో, ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు కివిని తినమని డాక్టర్లు సలహా ఇస్తారు.
దానిమ్మ : చల్లని వాతావరణంలో కీళ్ల నొప్పులు చాలా ఇబ్బంది పెడతాయి. ఆర్థరైటిస్ రోగులకు దానిమ్మ పండు తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మలో ఐరన్, ఫైబర్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.