ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు : హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెం.205 కు కొనసాగింపుగా సాధారణ పరిపాలన శాఖ లోని ప్రవాస భారతీయుల (జీఏడి – ఎన్నారై) విభాగం పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈనెల 9న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) మార్గదర్శకాల మెమో జారీ చేశారు. ‘ప్రవాసీ ప్రజావాణి’ లో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా ప్రామాణికరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘ప్రవాసీ ప్రజావాణి’ నిర్వహణ మార్గదర్శకాల ఉత్తర్వుల ప్రతులను శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి విడుదల చేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, దుబాయి లోని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నర్సింలు, స్వచ్ఛంద సేవకులు శాంతిప్రియ యాదవ్ (మలేసియా), బషీర్ అహ్మద్ (ఓమాన్ రిటనీ) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రవాసీ ప్రజావాణి’ నిర్వహణకు చక్కటి ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ కు వారు కృతఙ్ఞతలు తెలిపారు.
‘ప్రవాసీ ప్రజావాణి’ మార్గదర్శకాలు : గల్ఫ్, ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో విదేశాల్లో ఉన్న బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయవచ్చు. తదుపరి చర్యల కోసం ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తారు.
జీఏడి – ఎన్నారై విభాగం పరిధిలో : గల్ఫ్ తదితర దేశాల నుంచి మృతదేహాలను ఇండియాకు తెప్పించడం, విదేశాల నుంచి వచ్చిన శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం (దారిద్ర రేఖకు దిగువన – బీపీఎల్ వారికి), పేషేంట్లను స్వదేశానికి రవాణా చేయడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం చేసి విడుదలకు కృషి చేయడం, వీసా గడువును మించి (ఓవర్ స్టే) అక్కడే నివసించడం, అత్యవసర పరిస్థితులు, క్షమాభిక్ష (ఆమ్నెస్టీ), జీతం బకాయిలు ఇప్పించడం, విదేశాలలో మన వారికి అవసరమైన అన్నిసేవలను జీఏడి – ఎన్నారై విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలు, ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానము చేస్తుంది. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.
ఎన్నారై మహిళా పోలీస్ విభాగం పరిధిలో : విదేశాల్లోని ఎన్నారై కుటుంబ వివాదాల పరిష్కారం గురించి వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ లక్డీకాపూల్ లోని పోలీస్ కార్యాలయంలోని ఎన్నారై విమెన్ సెల్ కు పంపిస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్, పోలీస్ ఎఫ్ఐఆర్, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.
ఏజెంట్ల మోసాలు – పోలీస్ శాఖ పరిధిలో : నకిలీ ఏజెంట్లు, చీటింగ్ కేసులు, విదేశాలకు సంబంధించిన ఇతర సారూప్య సమస్యలపై తదుపరి చర్యల కోసం సంబంధిత కమీషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు బదిలీ చేస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ తదితర వివరాలు అందజేయాలి.
గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా : రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం గల్ఫ్ దేశాలలో చనిపోయిన వ్యక్తి జీవిత భాగస్వామి (భార్య / భర్త), పిల్లలు, తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విజ్ఞప్తిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తారు. నేరుగా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. తెల్లకాగితంపై అభ్యర్థన లేఖ, పాస్ పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి.
గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు : గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలలో అడ్మిషన్ల కొరకు వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం విద్యా శాఖకు బదిలీ చేస్తారు. తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, విద్యార్థి సర్టిఫికెట్లు సమర్పించాలి.