Machilipatnam Port : త్వరలోనే మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇటీవలే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం మరింత వేగం పెంచింది. ఈ మేరకు పోర్టు నిర్మాణానికి రూ.3,940 కోట్ల రుణం మంజూరైందని తెలిపింది. దీంతో పోర్టు వ్యయానికి అవసరం అయ్యే 100 శాతం రుణాన్ని పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు రుణం మంజూరు ఉత్తర్వులు రావడంతో అతి త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తుంది. కాగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేయాలంటే ముందస్తుగా జాతీయ రహదారులు, రైలు మార్గాలను కలుపుతూ రోడ్డు కం రైలు మార్గాల నిర్మాణం కోసం భూసేకరణ, నిధులు విడుదల చేయాల్సి ఉందని ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
ఈ మేరకు పోర్టు కనెక్టివిటీ కోసం, రోడ్ కం రైలు మార్గాల కోసం ఎంత భూమి సేకరించాలి, రైతులకు ఎంత మేర పరిహారంగా ఇవ్వాలి… వంటి తదితర వివరాలను రాష్ట్ర ఆర్‌అండ్‌బీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ వార్తతో ప్రజలంతా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. థాంక్యూ సీఎం సార్ , థాంక్యూ సీఎం జగన్ సార్, గ్రేట్ సీఎం జగన్ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.