Devotional : షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులకు సాయి సంస్థాన్ బోర్డు శుభవార్త చెప్పింది. మహారాష్ట్ర లోని షిర్డీ బాబాను దర్శించడానికి వెళ్లే భక్తులు సాయిబాబా దర్శనం చేసుకోవడంతో పాటు… ఆయన సమాధిని స్పృశించే అవకాశాన్ని భక్తులు మళ్ళీ పొందనున్నారు. గతంలో ప్రతి భక్తుడికి సాయిబాబా దర్శనంతో పాటు సమాధిని తాకే అవకాశం ఉండేది. అయితే భక్తుల తీవ్ర రద్దీ నేపథ్యంలో షిర్డీ సాయి సంస్థాన్ దర్శన నియమల్లో పలు మార్పులు చేసింది. భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టింది. వీఐపీ భక్తులు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అవకాశం కల్పించింది.
దీంతో సాధారణ భక్తులు దూరం నుంచే బాబా సమాధిని దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం సామాన్య భక్తులకు సైతం సాయి సమాధిని తాకే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సాయి సంస్థాన్ బోర్డు ప్రకటించింది. అలానే సాయి హారతి జరుగుతున్నప్పుడు భక్తులు గురుస్థాన్ ఆలయానికి ప్రదక్షిణలు చేయవచ్చు. భక్తుల రద్దీ ఎక్కువుగా ఉన్నప్పుడు తక్కువ ఎత్తులో ఉన్న అద్దాలు అమర్చడం, ద్వారకామాయి గుడిలోకి లోపలి నుంచి భక్తులను అనుమతించడం వంటి నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. ఆలయ ట్రస్టు బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై సాయిబాబా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, షిర్డీ గ్రామస్తుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సాయి సంస్థాన్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
సాయిబాబా దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. వారంతా బాబా సమాధిని తాకాలనే ఆశతో వస్తుంటారు. అయితే గతంలో సాయిబాబా సమాధి ముందు గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టడంతో భక్తులు సమాధిని తాకలేక అసంతృప్తితోనే బాబా దర్శనం చేసుకుని వెళ్లేవారు. అటువంటి వారికి షిర్డీ సాయి సంస్థాన్ నిర్ణయం ఆనందం కలిగించే విషయమని చెప్పాలి.