Political కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా పావులు కదుపుతున్న భాజపా…దేశంలో ఆ పార్టీని బలహీన పరిచే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా… గోవాలోనూ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బే కొట్టింది.. కమలం పార్టీ. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా 8 మంది ఎమ్మెల్యేను భాజపాలో చేర్చుకుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో వారంతా కాషాయ పార్టీలో చేరిపోయారు.
ఈ రోజు ఉదయం పార్టీ మారిన నేతలంతా స్పీకర్‌ను కలవడంతో ఊహాగానాలు మొదలవగా… వారతంగా తమ పార్టీలో చేరుతున్నారని గోవా భాజపా చీఫ్ సదానంద్ షెట్ తనవడే వెల్లడించారు. ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే 8 మంది కాంగ్రెస్ నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. వీరిలో గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్, మైకెల్ లోబో వంటి సీనియర్ నేతలుండడం గమనార్హం. ఇప్పటి వరకు గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడుల మూడింట రెండొంతుల మంది పార్టీని వీడడంతో… ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశం లభించింది.
గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకోగా… మెజార్టీ మార్కుకు ఒక్క సీటు దూరంలో నిలిచింది. ఐతే… మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 చోట్ల విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది భాజపాలో చేరారు.