‘గార్గి’ సినిమాని చూస్తే బాపుగారి ‘పెళ్లి పుస్తకం’ సినిమాలోని ‘మంచి, చెడులు రాశులు పోసి వుండవు.’ అనే డైలాగ్ గుర్తొస్తుంది. ఎందుకంటే, హీరోయిన్ సాయి పల్లవి తండ్రి పాత్రపట్ల అటు కుటుంబ సభ్యులు, సమాజంతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా సానుభూతి కలుగుతుంది. చివరలో ‘నిజమే… మంచి, చెడులు రాశులు పోసి వుండవు’ అనిపించక మానదు.
తొలినాళ్ల నుండీ సాయి పల్లవి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తద్వారా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ‘విరాట పర్వం’లోనూ చక్కని పాత్రను పోషించారు సాయి పల్లవి. ‘గార్గి’ చిత్రంలోనూ ఆమె పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సబ్జెక్టు విషయానికొస్తే అనాదిగా స్త్రీలు వయసుతో సంబంధం లేకండా ఎదుర్కొంటున్న సమస్యే. అదే ఆరేళ్ల పాప నుండీ అరవై ఏళ్ల ముదుసలి వరకూ ఎవరినీ వదలకండా అత్యాచారానికి గురి కావడం. అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల పాప అత్యాచారానికి గురి కావడం, అందులో ఐదవ నిందితుడిగా సాయి పల్లవిని చేర్చడంతో కథ మొదలవుతుంది. ఈ సినిమాలో చెప్పుకోదగిన అంశాలెన్నో వున్నాయి. ముఖ్యంగా దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ చిత్రాన్ని రూపొందించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. రొటీన్ సినిమా హంగూ, ఆర్భాటాలుండవు. సాధారణంగా కోర్టు సీన్లలో జనమంతా వుండడం, మధ్యమధ్యలో గోల చేయడం మనం చూస్తూంటాం. కానీ, ఈ చిత్రంలో విచారణ సమయంలో సాయి పల్లవిని సైతం బయటే కూర్చోబెట్టడం కనిపిస్తుంది. అందుకే, కోర్టు సీన్లు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. పైగా, జడ్జిగా నటించిన మహిళ సహజమైన నటన వైవిధ్యభరితంగా వుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను గౌతమ్ రామచంద్రన్ రూపొందించిన తీరు అబ్బురపరుస్తుంది.
ఇకపోతే, మరో ముఖ్యమైన విషయమేంటంటే… ఈ సినిమాకి సాయి పల్లవి హీరోయిన్ కాదు. హీరో అని చెప్పాలి. అలాగని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనడానికి లేదు. అత్యాచార నిందితుడి కుటుంబం సమాజం నుండి ఎలాంటి అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది అన్నది ఒక పాయింట్ అయితే, పురుషుడు తన కూతుర్ని ఏ దృష్టితో చూస్తాడో అందరినీ అలాగే చూడడు, పైగా తన కూతురికన్నా చిన్నపిల్ల అయినా కామంతోనే చూసే అవకాశాలే ఎక్కువ అనేది మరో పాయింట్. ఇక కీలకమైన పాయింట్ ఏంటంటే సాటి స్త్రీకి తనవారివల్ల అన్యాయం జరిగితే స్త్రీ అనుబంధాలకు లొంగకండా స్త్రీగానే ప్రతిస్పందించాలనే న్యాయపరమైన ముగింపు ఎంతో గొప్పగా అనిపిస్తుంది.
ఉదయం న్యూస్ పేపర్ తెరచినా, టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానెల్ పెట్టినా ఎలాంటి వార్తలెదురవుతాయోనని భయపడే రోజులు దాపురించాయి. దేశంలో ఎక్కడో ఒకచోట దాదాపుగా ప్రతిరోజూ ఒక అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే వుంటుంది. వెలుగులోకి రాని సంఘటనలెన్ని మరుగునపడి పోతుంటాయో చెప్పలేం. పైగా, కొత్త చట్టాలెన్నింటిని రూపొందిస్తున్నా వయసుతో నిమిత్తం లేకండా కీచక పర్వాలు కొనసాగుతూనే వున్నాయి. ఈ రోజులు అంతరించిపోయి స్త్రీకి సంపూర్ణ రక్షణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…!!