సేవా భారతి, తెలంగాణ, లయన్స్ క్లబ్ గ్రీన్ ల్యాండ్స్ ట్రస్ట్, ఈశ్వర్ చందర్ ఛారిటబుల్ హాస్పిటల్, మెర్సీ మిషన్ మరియు బీఎస్‌ఎమ్‌ఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పెదవి చీలిక (మొర్రి), పిల్లలలో అంగిలి చీలిక, చేతులు – పాదాల శస్త్రచికిత్స, పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్‌ల కోసం ఉచిత శస్త్రచికిత్సలను అందిస్తున్నాయి.
హైదరాబాద్, జనవరి 2023: సేవా భారతి, తెలంగాణ, లయన్స్ క్లబ్ గ్రీన్ ల్యాండ్స్ ట్రస్ట్, ఈశ్వర్ చందర్ ఛారిటబుల్ హాస్పిటల్, మెర్సీ మిషన్స్ మరియు బీఎస్‌ఎమ్‌ఎస్ ట్రస్ట్ సంయుక్తంగా హైదరాబాద్‌లో జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఉచిత ప్లాస్టిక్ సర్జరీ క్యాంపును నిర్వహిస్తున్నాయి. ఈ శస్త్రచికిత్సలు అమెరికా, భారత్‌కు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్లచే నిర్వహిస్తున్నారు.
ఈ ఉచిత ప్లాస్టిక్ సర్జరీ శిబిరానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశాన్ని శనివారం అమీర్‌పేట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి సేవా భారతి తెలంగాణ ప్రెసిడెంట్ దుర్గారెడ్డి, లయన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులు విద్యాభూషణ్, కమల్ కుమార్, డాక్టర్ గులాబ్ రాణి, సేవా భారతి సభ్యులు సుబ్రమణ్యం చివుకుల మాట్లాడారు.
ప్రముఖ సోషల్ యాక్టివిస్టు, కాలిన గాయాల బాధితులకు కోసం కృషి చేస్తున్న నిహారి కూడా తమతో అనుబంధంగా పని చేస్తున్నారని వారు తెలిపారు. తన ఆధ్వర్యంలో శిబిరంలోని కొన్ని అంశాల్లో తమకు సహాకారం అందిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కాలిన గాయాలకు గురైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆమె సొంతంగా బీఎస్‌ఎమ్‌ఎస్ ట్రస్ట్‌ని స్థాపించి దేశవ్యాప్తంగా విశేష సేవలందిస్తున్నారని అన్నారు.
డా.సుదర్శన్ రెడ్డి, డాక్టర్, భవానీ ప్రసాద్ తదితర అమెరికాకు చెందిన వైద్యులు, నర్సుల ఆధ్వర్యంలో మెర్సీ మిషన్స్ సంస్థ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో వైద్య సహాయం అందించడం, ఉచిత శస్త్రచికిత్సలు చేయడం, ఉచిత మందులు ఇవ్వడం తదితర అంశాల్లో ఈ సంస్థ పని చేస్తుందని వివరించారు.
https://youtu.be/NSWdAg99Eig
హైదరాబాద్‌లోని ఓల్డ్ మల్లేపల్లిలోని సీతారాం బాగ్‌లోని డాక్టర్ ఈశ్వర్ చందర్ హాస్పిటల్‌లో ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించడానికి వారి బృందం జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు భారత్‌కు రానున్నారని వారు పేర్కొన్నారు. జనవరి 23వ తేదీన హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌లోని ఆసుపత్రిలో ఈ శిబిరానికి సంబంధించిన స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోగులకు ఎటువంటి ఖర్చు లేకుండా మొత్తం ఆపరేషన్ ప్రక్రియ స్వచ్ఛంద ప్రాతిపదికన జరుగుతాయని అన్నారు.
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చికిత్స అవసరమైన ఎవరికైనా ఉచిత చికిత్స సౌకర్యం అందుబాటులో ఉంటుంది. జనవరి 9, 2023 నుంచి ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల మధ్య 9848241640 మరియు 7680974918 నంబర్లలో సంప్రదించి నమోదు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ స్క్రీనింగ్ జనవరి 21, 2023న ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.00 గంటల మధ్య డాక్టర్ ఈశ్వర్ చందర్ ఆసుపత్రిలో జరుగుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.