Crime News : నకిలీ ఐడీలు, వెబ్సైట్లతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రుణ యాప్లు, సైబర్ నేరాలతో రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో నకిలీ మ్యాట్రిమోనిలో పేరు నమోదు చేసుకున్న మహిళ… ఏకంగా రూ.48 లక్షలు మోసపోయిన ఘటనలో కలకలం సృష్టించింది. అసలేం జరిగిందంటే..?
ఆన్‌లైన్ మోసగాడి వలలో చిక్కుకుని మోసపోయినట్లు నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. నకిలీ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్న మహిళ… అందులో చూసి శ్రీకాంత్ అనే వ్యక్తిని ఇష్టపడినట్లు తెలిపారు. అమెరికా వచ్చేందుకు వీసా కోసం శ్రీకాంత్ డబ్బు పంపాలని కోరగా… తన బ్యాంకు ఖాతాకు రూ.48 లక్షలు పంపినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి నిందితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విజయవాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. మ్యాట్రిమోనిలో ఫొటో, పేరు మార్చి మోసానికి పాల్పడినట్లు తెలిపారు. గతంలో ప్రకాశం జిల్లాలోనూ మోసానికి పాల్పడి అరెస్టైనట్లు పేర్కొన్నారు. నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.