Etela Rajender New Party in Telangana?,Konda Vishweshwar Reddy,Kodanda Ram,Theenmar Mallanna,Tealngana News,Telangana Politics,
“తెలంగాణ లో కొత్త రాజకీయం” ? ఎవరెవరు ఎటు వైపు ?
తెలంగాణలో కొత్త రాజకీయం రాబోతోందా? టీఆర్ఎస్ నుంచి ఉద్వాసన ఖాయమైన ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడతారా? ఉన్న పార్టీలలో చేరతారా?
ఈ చర్చే ఇప్పుడు జరుగుతోంది. దీనిపై నా “వ్యక్తిగత అభిప్రాయం…” ఈటెల ఇప్పుడున్న ఏ పార్టీ లోనూ చేరరు. కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడ లేదు కదా ఎన్నిక ఎన్నికకు దిగజారిపోతోంది. ఆ మునిగిపోయే నావలాంటి కాంగ్రెస్ పడవలో కాలుపెట్టడం ఏ తెలివైన రాజకీయనాయకుడు చేయడు. రాజేంద్ర అంత తెలివి తక్కువ వాడు కాదు. కాంగ్రెస్ లో చెరకుడ దు అంటే అదేదో అంటరాని పార్టీగా చూడటం కాదు. ఆ పార్టీ కి భవిష్యత్తు లేదని. ఏ నాయకుడైనా… జోరు మీదున్న పార్టీలో చేరతారు.. చేరాలి. కానీ కాంగ్రెస్ అందుకు ఏ మాత్రం సూటబుల్ కాదు…. ఇక బీజేపీ.. ఈ పార్టీ పరిధి పరిమితంగానే కనిపిస్తోంది. దుబ్బాక, గ్రేటర్లో ఊపు చూపించినా సాగర్లో బోర్లా పడింది. ఆ పార్టీని నమ్ముకొని రాజేంద్ర రాజకీయం లో తదుపరి మజిలీ ఎంచుకోవటం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది.
మరి ఈటెల ఏం చేస్తారు?
కొత్త పార్టీ పెడతారు. ఆయనతో కట్టుకట్టడానికి కేసీఆర్ వ్యతిరేకులు చాలా మంది సిద్దంగా ఉంటారు. కోదండ రామ్, మల్లన్న, కొత్త టీమ్ కోసం చూస్తున్న చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు అందులో ఉంటారు. వీళ్లంతా వ్యక్తులుగా “జీరో” ల్లానో.. బలహీనంగానో కనిపిస్తారు. కానీ ఆ జీరో పక్కన 1 పెడితే 10, 2 పెడితే 20, 9 పెడితే 90 అవుతారు.
కొత్త పార్టీ అనగానే అంత ఈజీ కాదు అనే మాట తక్షణం వినిపిస్తుంది. అదీ నిజమే. కానీ తెలంగాణలో గట్టి ప్రతిపక్షం లేని లోటు బాగా ఉంది. అదే పొలిటికల్ భాషలో “వ్యాక్యూం”.
తెలంగాణ “ఇచ్చారు..” అనే ఒక్కటి తప్ప “తెచ్చారు” అనే క్రెడిట్ కాంగ్రెస్ కు వచ్చే అవకాలు లేవని 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోకసభ ఎన్నికలు.. నిన్నగాక మొన్న టి దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు నిరూపించాయి. ఇంతకంటే ఆ పార్టీ టెస్ట్ చేసుకోడానికి ఇక అవసరం ఉండదు.
బీజేపీ దీ అదే పరిస్థితి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం అమలు కాకపోవడం, ఉత్తరాది లో మూడు రాష్ట్రా లు ఇచ్చి తెలంగాణ ను విస్మరించడం తెలంగాణ బీజేపీ కి “మైనస్” కాకపోవచ్చు కానీ “ప్లస్” కావడం లేదు. ఇదీ గత 20 ఏళ్లుగా కనిపిస్తూనే ఉంది.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో ఉన్న ఈటెల కు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా క్లైమ్ చేసుకునే హక్కు ఎప్పటికీ ఉంటుంది. ఇది రాజేందర్ కు అడ్వాంటేజ్ అవుతుంది.
తాజాగా వచ్చిన అసైన్డ్ భూముల వ్యవహారం తప్పించి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయన మీద వేరే ఆరోపణలు లేవు. ఆరోపణలు ఉండటం నేతలకు మైనస్సేమీ కాదు. అవినీతి ఆరోపణలు, అక్రమాల వ్యవహారాల్లో పాత్ర ఉండి కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉండటం తప్ప ఆరోపణలు అనేవి రాజకీయాల్లో ఎదగడానికి ఏ మాత్రం అడ్డు కాదు. ఇది అందరూ ఇప్పుడూ దేశంలో చూస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ టాప్ లెవల్ నేతలు అరడజను మంది తప్పించి జిల్లా స్థాయిలో చాలా మంది తన తదుపరి రాజకీయ జీవితం కోసం ఈటెల పార్టీకి ( పెడితే) వెళ్ళే అవకాశం ఉంటుంది. అందులో కొందరు అగ్రనేతల వారసులు (సంతానం) కూడా ఉండొచ్చు. ఊపు బాగుంది అంటే.. కొందరు అగ్రనేతలు ఉన్నా ఉండొచ్చు ( రాజకీయాలు అంటేనే అవకాశవాదం)
తెరాస కు ప్రత్యామ్నాంగా చెప్పుకునే బీజేపీ కి కూడా ఈటెల ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికీ చాలా చోట్ల ఆ పార్టీ కి గట్టి నాయకత్వం కావల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపన కోసం పార్టీ పెట్టబోతున్న షర్మిలకు కూడా ఈటెల పార్టీ (పెడితే) ఆమెకు వచ్చే అతితక్కువ ఆదరణ ఇంకాస్త అతితక్కువ కు పడిపోతుంది.
ప్రతి సమాజంలో వ్యతిరేక గళాలు ఉంటాయి. తెలంగాణల నూ ఉంటాయి.. ఉన్నాయి. అవి అధికార కేంద్రంలో ఉన్న వారి మీదే ఉంటుంది. ఈటెల టార్గెట్ కూడా అదే అవుతుంది. కాబట్టి ఆ వ్యతిరేక గళాలకు కొత్త ఏక నాయకత్వం అవసరం.
తెలంగాణ వచ్చినా అనుకున్న ఫలితాలు ఏవీ రాలేదు అనే వాదన ఉంది (పార్టీలు ఉన్నన్ని రోజులు అది ఉంటూనే ఉంటుంది). అది ఈటెల కే అడ్వాంటేజ్ అవుతుంది. ఆయన పార్టీ పెడితే దానికి ముందో వెనుకో “తెలంగాణ” ఉంటుంది.
అoదృష్ట వశాత్తూ తెలంగాణ కు కులగజ్జి లేదు. ఇక్కడ మంచి- చెడు .. అవసరం- అనవసరం చూసే లక్షణాలే ఎక్కువ. అందువల్ల కొత్త పార్టీ ల మీద కుల ముద్ర వేసి చంపే ప్రయత్నాలకు ఇక్కడ చోటు ఉండదు కాబట్టి కొంతలో కొంత ప్రజాస్వామ్యం ఉన్నట్టే.
తెలంగాణ లో ఎన్నికలకు (షెడ్యూల్ ప్రకారం అయితే) మరో రెండున్నర ఏళ్ళు సమయం ఉంది. రాజకీయాలకు ఇది చాలా ఎక్కువే. ఏమైనా జరగవచ్చు.
గమనిక:
పార్టీ పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉండటం వేరు..
ఆ పార్టీ గెలవడం వేరు. ఈ నా అభిప్రాయం ఈటెల కొత్త పార్టీ ఏర్పాటు.. దానికి కలిసి వచ్చే అంశాల గురించి మాత్రమే. పార్టీ పెడితే గెలుస్తారని కాదు. పెట్టే పార్టీ కి ఎంత వరకు నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి అనేదే ముఖ్యం.
ఎడిటర్ – తెలుగు వరల్డ్ నౌ