Etela Rajender New Party, CM KCR, Telangana Politics, Telangana News, BJP, Congress, TRS, Political Analysis,
Telangana Politics: ఈటెలపై 20 రోజుల క్రితం కనిపించిన “సానుభూతి” గ్రాఫ్ తగ్గిపోయిందా?
ఈటెల ఆటా ? ఇటా ? మరి ఏ పార్టీ వైపు వెళ్తాడు ? కొత్త పార్టీ పెడతాడా ? నైరాశ్యం + అవకాశవాదం + ఆత్మరక్షణ = ఈటల.
* TRS తిరుగుబాటు నాయకుడు ఈటల వ్యవహారం అనుమానాస్పదంగా, అవకాశవాదంగా ఉన్నట్టు ఆయనను నమ్ముకున్న వాళ్ళు అంటున్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన నాటి నుంచి ఆయన కేసీఆర్ పై దూకుడుగా లేరు. ఆత్మరక్షణ వ్యూహాలతో ప్రవర్తిస్తున్నారు. సతమతమవుతున్నారు. తనకు తాను తెలంగాణలో ఒక సమర్ధ నాయకునిగా, అవసరమైతే KCR కు పోటీదారుగా రుజువు చేసుకునే చాన్స్ పోగొట్టుకుంటున్నట్టే కనిపిస్తోందని ఆయన అభిమానుల ఆవేదన. ఎక్కిన గడప, దిగిన గడపలాగా కాంగ్రెస్, BJP తదితర పార్టీలు, వ్యక్తులతో ఆయన మంతనాలు ఇందుకు అద్దం పడుతున్నవి. ఈటలకు KCR పై పోరాటం చేయాలన్న కసి, పట్టుదల, ప్రతీకార వాంఛ ఏ కోశాన కనబడడం లేదు. ఈటెలపై 20 రోజుల క్రితం కనిపించిన సానుభూతి గ్రాఫ్ తగ్గిపోయింది. వేడి తగ్గిపోతోంది. ఇటు BC లు, అటు రెడ్డి సామాజికవర్గం మద్దతు లభిస్తుందని అందరూ అనుకున్నప్పటికీ ఆయన ఆ దిశగా అడుగులు వేయలేకపోవడానికి స్వయంగా భయపడడమే ప్రధాన కారణం. ఆయన తన ఆస్తులు, వ్యాపార సామ్రాజ్యం గురించి వణుకుతూ ఉంటే ఆయన అనుచరులు ఇంకా గజగజ వణకుతున్నారు. ఇప్పుడు ఈటల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి వలె ఉన్నది. సొంతంగా పార్టీ పెట్టలేని అసహాయత. లేదా గతంలో ప్రాంతీయ పార్టీలు పెట్టి మూసివేసిన ఉదంతాలు కూడా కావచ్చును. కనుక ఈటల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం ఏదో ఒక జాతీయ పార్టీలో ఆశ్రయం పొందడం. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది. అందులో చేరడం వల్ల రక్షణ దొరకడం సాధ్యం కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న BJP లో చేరితే కొంత ఉపశమనం లభించవచ్చన్నది ఈటల అభిప్రాయం.
అయితే ఈటలపై వస్తున్న అభియోగాలన్నీ రాష్ట్ర పోలీసు పరిధిలోనివి. ఈటల కుటుంబం ఆశిస్తున్నట్టు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఏమి చేయగలరు? ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ఏమి సూచించగలరు? ఇక కేసీఆర్ వ్యతిరేక శక్తులు, వ్యక్తులతో ఐక్య వేదికను నిర్మించాలని కోదండరాం సహా మరికొందరు తీసుకు వస్తున్న ప్రతిపాదనలు ఆచరణ రూపం దాల్చడం కష్టం. అది సక్సెస్ కూడా కాకపోవచ్చు. కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ ఉన్న శక్తులు, వ్యక్తులు ఒక ఎజండాపైకి రావడం దుర్లభం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తిరుగులేని నాయకుడు. ఆయనకు దరిదాపుల్లో సరితూగే నాయకుడు విపక్షాలలో ఎవరూ లేరు. కేసీఆర్ కు సమఉజ్జీ లేరు. ఆయనకు గట్టి పోటీదారు సొంత పార్టీ TRS నుంచే తయారు కావచ్చునని గడచిన రెండు, మూడేండ్లుగా వదంతులు ఉన్నవి. కానీ అలాంటి వాతావరణం TRS లో లేదు. ధిక్కార స్వరం వినిపిస్తే ఏమవుతుందో ఈటల ఎపిసోడ్ కండ్ల ముందు ఉన్నది. KCR నీడ పడినంత కాలం ఈటల ‘గొప్ప నాయకుడు’గా చెలామణి అయ్యారు. KCR నుంచి వేరు పడగానే ఈటల ‘సాధారణ’కార్యకర్త వలె మారిపోవడం విచిత్రం. తాను తయారు చేసిన ‘లక్షలాది మంది కార్యకర్తలలో కోదండరాం ఒకడు’ అని గతంలో KCR అన్నారు. ఈటల అయినా మరొకరైనా KCR అభిప్రాయం అదే. ఆయన పార్టీ నిర్మాత. ఆయనే ఉద్యమ సారధి. ఆయనే ముఖ్యమంత్రి. TRS లో అసమ్మతివాదులు, అసంతృప్త నేతలు, నిరాశావాదులు లేరని కాదు, వారంతా కుక్కిన పేను వలె ఉండవలసిందే. లేదంటే ఏమి జరుగుతుందో వాళ్లకు తెలుసు. అందువల్ల మౌనం మినహా మరో మార్గం లేదు. ఈటల వ్యవహారంలో కేసీఆర్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ రాజకీయపరమైనదే కావచ్చు, కానీ ఈటల భూ బాగోతం వెలికి తీసి, అవమానించి బర్తరఫ్ చేయడం వల్ల ఈటల అదే రోజు కేసీఆర్ పై యుద్దానికి పిలుపునిస్తారని కొందరు కార్యకర్తలు ఊహించారు. కానీ తాను ఎందుకు డిఫెన్స్ గేమ్ ఆడుతున్నాడో ఈటలకు మాత్రమే తెలుసు. చట్టబద్ధంగా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకోగలడు? ఎక్కడో ఒక చోట అధికారాన్ని ప్రయోగించే ఉండాలి. ఎక్కడో ఒక చోట నిబంధనలను కాలరాసే ఉండి ఉండాలి. ఆయన ఏమి చేసినా ఇంతకాలం కేసీఆర్ ఉపేక్షించడానికి కారణం ఆయన BC ముదిరాజ్ కావడమేనని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నవి. అలాగని ఈటల BC కార్డును సంపూర్ణంగా వాడుకోలేని ఒక అవస్థ. ఆయన భార్య రెడ్డి కావడంతో కొడుకు, కూతురు ‘రెడ్డి’ అయిపోయారు. తెలంగాణ ఉద్యమంలో తన వాటా ఉందని ఆయన వాదించవచ్చు. అందువల్లే OWNER లము అనే మాట అని వాడి ఉండాలి. కేసీఆర్ లేకపోతే ఈటల ఎక్కడ? అనే ప్రశ్నలకు జవాబు లేదు. సమిష్టి పోరాటంగా, సకలజనుల పోరాటంగా ఒప్పుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. ఏదైనా అది 2014 కు ముందు చెల్లుబాటు అయిన కథ. తర్వాత ఆయన ఏకవీర. సాధారణ పరిపాలన, వైద్య ఆరోగ్య శాఖ, సమాచార, ఇరిగేషన్ తదితర కీలక శాఖలు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే ఉన్నవి. ఆయన మాటే శాసనం కావడం వలన ప్రభుత్వంలో, పార్టీలో ఎదురు చెప్పే వాళ్ళు లేరు. ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు లేరు. సొంత కొడుకు KTR అయినా, మేనల్లుడు హరీశ్ రావు అయినా మినహాయింపు లేదు. కేసీఆర్ చాలా పకడ్బందీగా విపక్షాలను నిర్వీర్యం చేస్తూ, అధికార పక్షంలో సర్వాంతర్యామిగా అవతరించారు.
ఈ దశలో ఈటల ‘ఆత్మగౌరవం’ పేరిట చేసిన వ్యాఖ్యలు బలహీనంగా, పేలవంగా ఉన్నవి. పోనీ ఆయన బర్తరఫ్ నుంచీ అదే నినాదంతో ఉన్నారా..అంటే అదీ లేదు. ఆత్మగౌరవ నినాదం హుజురాబాద్ లో ఎందుకో నిప్పు రగిలించలేదు. జనం వెల్లువలా వస్తారని వేసుకున్న అంచనాలు తప్పినవి. సానుభూతి ఉష్ణోగ్రతలను కొనసాగించగలగిన ఎత్తుగడలు ఈటలకు లేవు. అలాంటి సలహాదారులు కూడా కరువయ్యారు. TRS లో ఒక సమస్య ఏమిటంటే అందరూ కేసీఆర్ లాగా ప్రవర్తించాలని అనుకుంటారు. అందువల్ల ఎవరి సలహాలు చెవికెక్కవు. సలహాలు తీసుకోరు. కేసీఆర్ వేరు. ఆయనకు అనుభవం, జ్ఞానం, పలు సబ్జెక్టులపై సాధికారత, రాజకీయ వ్యూహాలు,ఎత్తుగడల ముందు ఎవరైనా దిగదుడుపే. కాగా ఆత్మగౌరవ నినాదం నెమ్మదిగా కనుమరుగవుతున్నది.
బిజెపిలో చేరితే ఆత్మగౌరవం అనే మాటకు అర్థం ఎట్లా వుంటుంది. ప్రజల పక్షాన వుండడానికి ఈటల దగ్గర ‘ప్రత్యామ్నాయ’ ప్రణాళికలు ఏమున్నవి? కేసీఆర్ కొడితే నొప్పి ఉంటుంది, కానీ దెబ్బలు కనిపించవు. ఎవరినైనా లొంగదీసుకోగలరు. ఎవరినైనా భయపెట్టగలరు. ఎవరినైనా అణచివేయగలరు. కుల సంఘాలు, ప్రజా సంఘాల ప్రాతిపదికన ఎన్నికలలో నిలబడితే, డిపాజిట్ కూడా రాదని ఈటలకు తెలుసు.“నేను ముది రాజ్ బిడ్డను. ఎవరికీ భయపడను” అని తన మంత్రి పదవిని లాక్కున్న నాడు ఈటెల అన్నారు. కానీ ముదిరాజ్ సామాజిక వర్గం నాయకులను తన వైపు నిలుపుకొనే వ్యూహాలను కేసీఆర్ విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నారు. రెడ్డి, కాపు వర్గాలను ఈటలకు దూరం చేయడానికి మంత్రి గంగుల కమలాకర్ ను ముఖ్యమంత్రి రంగంలోకి దించారు. మండలానికి ఒక ఎమ్మెల్యేను ఇంచార్జీగా పెట్టారు. హుజురాబాద్ లోని అన్ని పార్టీల నాయకులను నయానో భయానో TRS నాయకత్వం లొంగదీసుకున్నది. ఈటెల రాజేందర్ రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా తన కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలు లేకుండా పోయారు. ఇది ఆయనను మానసికంగా మరింత బలహీనపర్చింది. ఈటెల రాజేందర్ బిజెపిలో చేరితే ఏమవుతుంది? వ్యక్తిగతంగా ఆయనకు రక్షణ దొరుకుతుందేమో?. కానీ బిసిలు ఎప్పటికీ ఒక రాజకీయ పార్టీ పెట్టలేరని, వాళ్లు ఎప్పుడూ ఏదో ఒక అగ్రకుల పార్టీలో వుండాలి తప్ప మరేమీ చేయలేరని మనం నిర్ధారించుకోవచ్చును. ఈటల తనకు తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, పలు సందర్భాల్లో నోరు పారేసుకోవడం, ఓర్పు లేకపోవడం వల్ల ఆయన కోరి కష్టాలు తెచ్చుకున్నట్టయ్యింది.
ఎడిటర్ – తెలుగు వరల్డ్ నౌ