Bhakthi : దేశంలో ఎన్నో దేవాలయాలు మనదేశ చరిత్రకు, మన కళా వైభవానికి నిదర్శనంగా విరాజిల్లుతున్నాయి. వేల ఏళ్లుగా అద్భుత సాంస్కృతి, సంప్రదాయలకు నిలయంగా వర్ధిల్లుతున్న దేవాలయాల్లో… దసరా నవరాత్రుల వేళ తప్పక దర్శించాల్సిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఈ నవరాత్రులను పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక సహా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలను నిర్వహిస్తుంటారు. విజయవాడలోని బెజవాడ కనక దుర్గమ్మ దేవాలయంలో అయితే తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. తెలంగాణలో వైభవంగా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తుంటారు. ఈ రాష్ట్రాల్లో తప్పక దర్శించుకోవాల్సిన కొన్ని దేవాలయాలున్నాయి. ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలున్న ఈ దేవాలయ వివరాలు… మీకోసం.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బెజవాడ కనక దుర్గమ్మ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవరాత్రులు మొదలవుతున్నాయంటే.. విజయవాడ మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఈ దేవాలయంలో… 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి.. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు చేస్తారు.
శ్రీశైలం మల్లన్న ఆలయం.. దసరా నవరాత్రుల్లో రాయలసీమలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఆంధ్రా, తెలంగాణ నుంచి రోడ్డు మార్గం మాత్రమే అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి సుమారు 213 కిలోమీటర్ల దూరంలో మల్లన్న దేవాలయం ఉంది.
చాముండేశ్వరి దేవాలయం, కర్నాటక… కర్నాటక రాజధాని బెంగళూరుకు 140 కిలోమీటర్ల దూరంలోని మైసూరుకు అత్యంత సమీపంలో చాముండేశ్వరీ దేవి ఆలయం ఉంది. దసరా నవరాత్రులకు వేళ ఈ ఆలయంలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఈ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని శక్తి పీఠాల్లో ఒకటిగా భావిస్తుంటారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని దసరా సమయంలో నిర్వహించే జంబుసవారి కార్యక్రమంలో ఏనుగుపై ఊరేగిస్తుంటారు.
వైష్ణోదేవి ఆలయం.. భారత్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో వైష్ణో దేవి ఆలయం ముఖ్యమైంది. ఈ ఆలయం కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలోని త్రికూట కొండపై ఉంది. ఈ ఆలయం మహా సరస్వతి, మహాకాళీ, మహాలక్ష్మీల ఐక్యతను సూచిస్తుంది. నవరాత్రుల వేళ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారు గుహ లోపల ఉండి భక్తులకు దర్శనమిస్తారు.
కామాఖ్య మాత దేవాలయం.. అస్సాం రాష్ట్రంలోని గౌహతి సమీపంలో నీలాచల్ కొండపై ఉంది కామాఖ్య దేవాలయం. ఈ ఆలయంలో రాతి విగ్రహ రూపం ఉండదు. అమ్మవారి స్త్రీ జననేంద్రియ ఆకారంలో ఉన్న రాతిని పూజిస్తుంటారు. ఈ ఆలయంలో ఉండే స్త్రీ జననేంద్రియ ఆకారంలో ఉండే రాయి పగటి సమయంలో భూగర్భం నుంచి వచ్చే నీటితో నిండి ఉంటుంది. అందుకే ఈ దేవతను రక్తస్రావ దేవతగా పరిగణించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు… భక్తులు.