Gossip effects : విన్న పుకారు.. నిజమా? కాదా? అని తెలిసుకునే వరకూ జనం ఆగరు. దావానలంలా స్ప్రెడ్ అయిపోతుంది. అది ఏ రకమైన గాసిప్ అయినా అల్లకల్లోలం సృష్టిస్తుంది. బంధాలను విడదీస్తుంది. సమాజం నుంచి నిందలు తెచ్చిపెడుతుంది. మానసిక వేదనకు గురి చేస్తుంది. అలాగని వాటిని భరిస్తూ, బాధపడుతూ ఉండనక్కర్లేదు. పుకార్లకు చెక్ పెట్టాలంటే కొన్ని మార్గాలున్నాయి.
మీమీద ఏదైనా రూమర్ పుట్టింది. దానిని ఆపాలని మీరు చేసే ప్రయత్నం వల్ల దానికి మరింత బలం చేకూరుతుంది. మీ గురించో, మీ లవ్ మేటర్ లోనో ఏదైనా అభ్యంతరకరమైన గాసిప్ విన్నప్పుడు దానిని విని వదిలేయండి. నిజానికి అది చాలా బాధిస్తుంది. అలాంటి సమయంలోనే మీకు మీరు బిజీగా ఉండటం ఉత్తమం. మంచి స్నేహితులతో బయటకు వెళ్లడం, కొత్త అభిరుచుల్ని అలవాటు చేసుకోవడం మంచిది. మీరు స్ట్రాంగ్‌గా ఉండటం చూసి పుకార్లు మిమ్మల్ని ప్రభావితం చేయలేదని వాటిని పుట్టించిన వారు సైలెంటైపోతారు.
కొంతమంది మన దగ్గర ఇతరుల గురించి గాసిప్స్ చెబుతూ ఉంటారు. అక్కడే ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎవరి గురించో మన దగ్గర మాట్లాడిన వారు.. మన గురించి ఇతరులతో మాట్లాడకుండా ఉండకపోరు. భవిష్యత్‌లో అలాంటి వారి గాసిప్స్‌కి మనం బలి కాకూడదనుకుంటే వారికి దూరంగా ఉండటం.. లేదంటే వారు గాసిప్స్ చెబుతుంటే అక్కడి నుంచి వెళ్లిపోవడం ఉత్తమం. కొన్ని పుకార్లు భార్యా,భర్తలు-ప్రేమికుల మధ్య చిచ్చును పెడుతుంటాయి. మీ మధ్య ఏ విషయం ఉన్నా ముందుగానే మీ పార్టనర్ కి తెలియజేయడం ఉత్తమం. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటే ఎంతమంది ఎన్ని మాట్లాడిన పట్టించుకోనవసరం లేదు.
పుకార్లు ఎక్కువగా మీ గురించి బాగా తెలిసిన వారు మొదలుపెడతారు. మీ మధ్య ఏదైనా గొడవ జరిగినా.. బ్రేకప్ అయినా ఇతరువల వద్ద మీ గురించి ఉన్నవి, లేనివి మాట్లాడటం షురూ చేస్తారు. మన వెనుక ఇతరులు మాట్లాడే మాటలు ఒత్తిడికి గురి చేస్తాయి. కానీ ఇక్కడే కాస్త సంయమనం పాటించాలి. మొదటగా మిమ్మల్ని మీరు నమ్మాలి. నచ్చిన స్నేహితులతో పంచుకోవాలి. ఇవన్నీ కాకుండా చాలా డిస్టర్బ్ అయితే కౌన్సెలర్ సాయం తీసుకోవచ్చు.