మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనమవుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ (W& CSW) డీసీపీ సృజన కర్ణం అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హల్లో ఈరోజు మాదకద్రవ్య వినియోగంపై సైబరాబాద్ పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ సృజన మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామన్నారు. డ్రగ్స్కు సంబంధించిన ఫిర్యాదుల కోసం 87126 71111 కి కాల్ చేయండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
అమృత ఫౌండేషన్ NGO డైరెక్టర్ మరియు పరిశోధక సైకాలజిస్ట్ దేవికా రాణి కూడా ఈ సమస్యను ఉటంకిస్తూ, “యువతులు మత్తుపదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మాదకద్రవ్యాల వినియోగం వారి భవిష్యత్తులను అంధకారంగా మారుస్తుంది, వారు ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం, అమృత ఫౌండేషన్ ఎన్‌జిఓ డైరెక్టర్ మరియు పరిశోధక సైకాలజిస్ట్ దేవికా రాణి, W& CSW ఏసీపీ ప్రసన్న కుమార్, ఇన్ స్పెక్టర్ సునీత, AHTU ఇన్ స్పెక్టర్ జేమ్స్ బాబు తదితరులు పాల్గొన్నారు.