సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు విధినిర్వహణలో ఉత్తమ సేవలను కనబరిచిన పోలీసు సిబ్బంది సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., మాట్లాడుతూ..ముందుగా సేవా పతకాలను అందుకున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు. ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసమాన్యమైన ప్రతిభను కనబరిచిన పోలీస్ సిబ్బందిని గుర్తించడానికి ప్రతీ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పతకాలను అందజేస్తాయన్నారు.
2023 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో 75 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసినట్టు తెలిపారు. వీటిలో మహోన్నత సేవా పతకాలు – 3, ఉత్తమ సేవా పతకాలు – 18, మరియు సేవా పతకాలు – 54 మందికి అందజేసినట్టు వివరించారు. ఈ పతకాలు అందుకున్న వారిలో కానిస్టేబుల్ నుంచి డీసీపీ ర్యాంక్ వరకూ ఉన్నారు. ఉత్తమ సేవా పతకాలు అందుకున్న వారిలో రోడ్ సేఫ్టీ డీసీపీ LC నాయక్, బాలానగర్ లా అండ్ ఆర్డర్ ఏసీపీ హనుమంత రావు ఉన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో విధుల పట్ల అంకితభావంతో, మంచి ప్రతిభ కనబర్చి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు. అలాగే, పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చేలా విధులు నిర్వహించాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించి, మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
పతకాలు అందుకోవడం వల్ల సిబ్బందిలో ఉత్సాహం పెరుగుతుందన్నారు. తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఇతర సిబ్బంది కూడా పతకాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డి. జోయెల్ డేవీస్, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ కె. నరసింహ, డీసీపీ EOW కె. ప్రసాద్, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం, ఎస్‌బి డీసీపీ సాయిశ్రీ, డీసీపీ రోడ్ సేఫ్టీ LC నాయక్, ఎస్‌ఓటిక డీసీపీ డి. శ్రీనివాస్, ఏడీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ జె ఎస్‌కె షమీర్, ఇతర ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.