క్రికెట్ అంటే ఎంతోమందికి ఇష్టం వుంటుంది. మరీ ముఖ్యంగా ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య జరగబోయే మ్యాచ్ ముందు నుండే అందరిలోనూ ఉత్కంఠను రేపుతుంది. కానీ, దురదృష్టవశాత్తూ కొన్నిసార్లు ఆ ఉత్కంఠను తట్టుకోలేక కొందరు కన్నుమూసే సంఘటనలూ జరుగుతుంటాయి. అలాంటి సంఘటనే ఒకటి జరిగి సర్వత్రా విషాదాన్ని నింపింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి బాల్ వరకూ ఉత్కంఠంగా కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూస్తూ ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
అస్సాంలోని శివ్ సాగర్ లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. శివ్ సాగర్ లోని ఓ థియేటర్ లో ఇండియా-పాక్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. పెద్ద స్క్రీన్ మీద మ్యాచ్ చూడాలనే ఉద్దేశంతో క్రికెట్ ప్రేమికులు వెళ్లారు. అందులో బిటూ గొగోయ్ కూడా ఉన్నాడు. స్నేహితులతో కలిసి మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాడు. మ్యాచ్ చూస్తూ తీవ్ర ఉత్కంఠతకు లోనై సీట్లోనే కుప్పకూలాడు. స్పృహ కోల్పోయిన బిటూ గొగోయ్ ను అతడి స్నేహితులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గొగోయ్ ఆస్పత్రికి తీసుకొస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడని తేల్చారు. గొగోయ్ మరణానికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వెల్లడించారు.
గుండె పనితీరులో వచ్చే అకస్మిక మార్పులు, గుండె పనితీరు ఒక్కసారిగా మందగించడం, శ్వాస తీసుకోవడంలో సమస్య, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలు కార్డియాక్ అరెస్ట్ కు గురైన రోగిలో కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెంటనే చికిత్స అందకుంటే రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తికి ఎంతసేపట్లో సరైన చికిత్స అందిందనే దానిపైనే ఆ రోగి బతికే అవకాశాలు ఉంటాయని వివరించారు. క్రికెట్ ని ప్రేమించడం తప్పు కాదు. ఆ మాటకొస్తే, క్రికెట్ మాత్రమే కాదు, సినిమానైనా, దేన్నైనా ప్రేమించడం తప్పు కానే కాదు. కానీ, అన్నింటికన్నా ప్రాణం ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బిటూ గొగోయ్ లా ఇంకెవరూ ఇలా ప్రాణాలు కోల్పోవద్దని కోరుకుందాం.