Rachakonda News : రేపు జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు రాచకొండ డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో నేరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో హనుమాన్ జయంతి ఉత్సవాల సమయంలో మత సామరస్యం కాపాడేలా, ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే శోభాయాత్ర సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, తమ పరిధిలో మతసామరస్యానికి కృషి చేస్తున్న వివిధ వర్గాల మతపెద్దలు మరియు శాంతి కమిటీ సభ్యుల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాచకొండ పరిధిలోని సున్నితమైన ప్రదేశాలలో ఉత్సవాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతియుతంగా ఊరేగింపులు జరిగేలా చూడాలని సూచించారు. ట్రాఫిక్ విభాగపు అధికారులు మరియు సిబ్బంది శోభాయాత్ర ఊరేగింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల నంబర్ ప్లేట్ల చెకింగ్, పత్రాల చెకింగ్ నిర్వహించాలని, అవసరమైన ప్రదేశాల్లో బాంబు తనిఖీ బృందాల ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఊరేగింపుల్లో పాల్గొనే సమయంలో మహిళలు ఎటువంటి వేధింపులకు గురికాకుండా షి టీమ్స్ బృందాలు ఎల్లవేళలా విధుల్లో ఉండాలని సూచించారు.
భక్తులు సంతోషంగా, శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. మతసామరస్యానికి భంగం కలిగించే చర్యలను పోలీసు శాఖ ఉపేక్షించబోదని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ నరసింహా రెడ్డి, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్, సీసీఆర్బి ఏసిపి రమేష్ , ఎస్బి ఏసిపి రవీందర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.