మనసుంటే.. పరిష్కరించాలన్న తపన ఉంటే దేశంలోని రైతు సమస్యలను పరిష్కరించడం పాలకులకు సాధ్యమేనని పంజాబ్‌కు చెందిన ప్రముఖ రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నారు. తాను 52 ఏండ్లుగా రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నానని, తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని ఇప్పటివరకు చూడలేదని చెప్పారు. ‘ఇక్కడ రైతులకు రైతుబంధు పేరుతో ఏడాదికి ఎకరానికి రూ.పదివేలు ఇస్తున్నారు. రైతులు సాగుకు సిద్ధమయ్యే సమయానికి పెట్టుబడి సహాయం అందుతున్నది. తెలంగాణలో విద్యుత్తు మోటర్లున్నా యి. అందరికీ 24 గంటలపాటు విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నారు. సకాలంలో విత్తనాలు అందుబాటులోఉంచుతున్నారు.
ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి..? రైతు సమస్యలను పరిష్కరించే నాయకుడు కేసీఆర్ ఉండడం వల్లే ఇది సాధ్యమయ్యింది’ అని తెలిపారు. మూడ్రోజులుగా ఇక్కడి వాస్తవాలను నేను ప్రత్యక్షంగా చూశానని, క్షేత్రస్థాయిలో తన కండ్లతో పరిశీలించిన తర్వాతే ఈ నిశ్చితాభిప్రాయానికి వచ్చానని చెప్పారు. దేశానికి కొత్త దిశ చూపిన నేత కేసీఆర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది దేశంలో నల్లచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటంలో బల్బీర్‌సింగ్ ముఖ్యభూమిక పోషించిన విషయం తెలిసిందే. రైతులను సమీకరించడంలో, ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించడంలో ఈయనే కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన బల్బీర్ సింగ్ ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా ఇంటర్య్వూ ఇచ్చారు. దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణలో తాను చూసిన వ్యవసాయం, రైతుల స్థితిగతుల గురించి ఆయన సవివరంగా మాట్లాడారు.
మీ పర్యటన తెలంగాణాలో ఎలా సాగింది? మీరు గమనించిన అంశాలేమిటి ?
నేను, నాతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు వందమంది రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమ విధానాలను పరిశీలించేందుకు వచ్చాం. కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరును అధ్యయనం చేశాం. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అద్భుతం. దేశానికి తెలంగాణ ఒక కొత్త దిశను చూపిస్తున్నదని చెప్పవచ్చు. సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చూపిస్తున్న చొరవ దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రీ చూపించడంలేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క రైతు, వ్యవసాయ విధానాలే కాదు.. ఇక్కడ ఇస్తున్న పెన్షన్లు, దళితబంధు, ఇంటింటికి తాగునీళ్లు.. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేకం కనిపిస్తాయి. వీటన్నింటినీ మేం చూశాం. రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని ప్రతి రైతు లబ్ధి పొందుతున్నాడు. ప్రతి రైతు ఇంటికీ రైతుబంధు వస్తున్నది. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆయన కుటుంబానికి ఐదు లక్షల రూపాయల సహాయం అందుతున్నది. ఇంత పెద్దమొత్తంలో రైతులకు వ్యక్తిగత బీమా ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరేదీ లేదు. ఉచితంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ఉచితంగానే కాలువల ద్వారా నీళ్లు ఇస్తున్నారు. ఇదంతా మామూలు విషయం కాదు. రైతులపై నిజమైన ప్రేమ ఉన్నవారు మాత్రమే ఇలా చేయగలరు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా పర్యవేక్షించడంతోనే ఇది సాధ్యమైంది.
పంజాబ్‌లో ఎలా ఉంది? అక్కడి రైతులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ?
పంజాబ్‌లో అనేక సమస్యలున్నాయి. పంటలకు కనీసమద్దతు ధర కోసం మేం పోరాటం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని మా పోరాటంతో కొంతవరకు కిందకు దించగలిగాం. కానీ, మద్దతు ధర నిర్ణయానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మాకు ప్రాతినిధ్యం లేదు. రైతులు లేకుండా వాళ్లు ఎలా నిర్ణయం తీసుకుంటారన్నది మా ప్రశ్న. అందుకే మా ఆందోళన పూర్తిగా విరమించుకోలేదు. మేం మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం. పంజాబ్‌లో నీటి సమస్య చాలా ఉంది. కాలువల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లు అందవు. అంతేకాదు.. అక్కడ నీళ్లు వాడుకుంటే పన్ను కట్టాల్సిందే. అది రైతులకు భారమే. అదే తెలంగాణాలో నీటితీరువా లేదు. పంజాబ్‌లోనూ ఉచిత విద్యుత్తు పాక్షికంగానే అమల్లో ఉన్నది. వ్యవసాయానికి 8 గంటలు ఇస్తున్నట్టు చెప్తున్నారు. కానీ, వాస్తవంలో అన్ని గంటలు కూడా రావడంలేదు. పైగా నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడంలేదు. రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. రైతులు, రైతుకూలీల ఆత్మహత్యలు మాకో సవాల్. చాలాచోట్ల ఇవి రికార్డు కూడా కావడంలేదు.
రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను పంజాబ్ ప్రభుత్వం ఆదుకున్నదా? కేంద్రం నుంచి ఏదైనా సహాయం అందిందా ?
ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా మేం పోరాటం చేశాం. ఈ పోరాటంలో మా రైతు సోదరులు అమరులయ్యారు. వారి కుటుంబాలన్నింటికీ ఇంకా సహాయం అందలేదు. మా పోరాటం తర్వాత పంజాబ్‌లో ముఖ్యమంత్రులుగా అమరిందర్‌సింగ్, చరణ్‌జీత్ సింగ్ చన్నీలు మారారు. కొత్తగా భగవంత్‌సింగ్ మాన్ సీఎం అయ్యారు. ఇప్పటికీ రైతు కుటుంబాలకు సహాయం అందలేదు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ప్రతి రైతు కుటుంబానికీ మూడు లక్షల చొప్పున సహాయం అందించారు. కేసీఆర్ సహాయం చేసినప్పుడైనా మా వాళ్లకు జ్ఞానోదయం అవుతుందనుకున్నాం. కానీ, వారిలో చలనం రాలేదు. పంజాబ్ రాజకీయ నాయకులు అబద్ధాలతో కాలం వెళ్లదీస్తారు. కేసీఆర్‌లా ఇచ్చిన మాటపై నిలబడేవారు కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి బీ-టీమ్. అందుకు మా వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయి. కేజ్రీవాల్‌కు రైతుల ప్రయోజనాల కన్నా బీజేపీ ప్రయోజనాలే ముఖ్యం.
రైతాంగానికి కేంద్రం ఏమీ చేయలేదంటారా..?
ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఒక్కటంటే ఒక్క రైతు అనుకూల నిర్ణయం తీసుకోలేదు. కార్పొరేట్ సంస్థలు తీసుకున్న వేల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తుంది కానీ.. రైతు రుణాలను మాఫీ చేయదు. అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నది. ఇది కర్షకుల ప్రభుత్వం కాదు.. కార్పొరేట్లకు దోచిపెట్టే ప్రభుత్వం. లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారో అమ్మేవారికే తెలియాలి. ఈ ప్రభుత్వం సామాన్యులకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయడంలేదు. రైతులంటే బీజేపీ ప్రభుత్వానికి లెక్కలేదు. ప్రజలపై వారికి పట్టింపు లేదు.
రైతులను సంఘటితం చేయడానికి మీ కార్యాచరణ ఏంటి ?
దేశంలో ప్రస్తుతం ఒక రాజకీయ ప్రత్యామ్నాయ అవసరం. బీజేపీ, కాంగ్రెస్ వంటివాటితో దేశానికి ప్రయోజనం లేదు. బీజేపీ కులం, మతం అంటూ ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చి, రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ సొంత సమస్యలతోనే సతమతం అవుతున్నది. ఈ నేపథ్యంలో రైతులను సంఘటితం చేసేందుకు మున్ముందు కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఆలోచనతో ఉన్నారు. రైతులు కేంద్రంగా ఒక ప్రత్నామ్నాయ వేదిక ఉండాలన్నది మా అభిప్రాయం. ఇక్కడికి వచ్చిన రైతుసంఘాల ప్రతినిధులంతా తమ తమ కార్యక్షేత్రాలకు వెళ్లి త్వరలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రత్యామ్నాయంపై చర్చిస్తారు. ఒక కొత్త ప్రత్యామ్నాయ పోరాట పంథాను మేం నిర్మించుకుంటాం. కేసీఆర్ మాకు మార్గనిర్దేశనం చేస్తారు.