వరుస ఎన్నికల కోడ్‌లతో కొంతకాలంగా ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోవడంతో రాష్ట్రంలో ప్రగతిరథం మరింత వేగంగా పరుగు తీయనున్నది. ఎన్నికల నియమ నిబంధనల కారణంగా కొంత మందగించిన ప్రభుత్వ కార్యక్రమాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. శ్రీరంగం పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. వెంటనే కార్యాచరణలోకి దిగారు.
ముందుగా మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌కు ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల కార్పొరేషన్‌కు గాయకుడు సాయిచంద్, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్‌కు మన్నె క్రిశాంక్‌ను ఎంపిక చేశారు. ఈ నియామకాలపై జీవో కూడా జారీ అయింది. ఈ ముగ్గురూ దళితులే కావడం విశేషం. మరోవైపు.. ఈ నెల 17న టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్టీ కార్యవర్గంతోపాటు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. మరుసటిరోజు శనివారం కలెక్టర్లతో సమావేశం నిర్వహించి, జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.
ఇదే సమావేశంలో దళితబంధుపైనా చర్చిస్తారు. ఈ నెల 19 నుంచి జిల్లాల పర్యటనను సీఎం ప్రారంభిస్తారు. మొత్తం మీద సీఎం కేసీఆర్ ఒకవైపు అధికార యంత్రాంగానికి మరోవైపు పార్టీ శ్రేణులకు సరికొత్త దిశానిర్దేశాన్ని చేయనున్నారు.