మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ అనుచిత విధానాలకు తెర లేపుతున్నదని టీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. ఇక ఉపేక్షించే సమస్యే లేదని, బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నది. అవసరమైతే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ సంగతి తేల్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్టు టీఆర్ఎస్లోని అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితికి మునుగోడు నుంచే ఊపిరులూదాలని కూడా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు అవి వెల్లడించాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడో రేపో రాష్ర్టానికి రానున్నారని, ఆ వెంటనే ఆయన పూర్తిస్థాయిలో మునుగోడుపైనే దృష్టి కేంద్రీకరించబోతున్నారని టీఆర్ఎస్ ముఖ్యులు తెలిపారు.
బీజేపీ ఆగడాల అంతు తేల్చడానికి మునుగోడులోనే ఎన్నిక అయ్యేదాకా మకాం వేయాలని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు టీఆర్ఎస్ ముఖ్యుడొకరు తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ముందే ఖరారైపోయింది. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య భారీ వ్యత్యాసం ఉన్నదని సర్వేలు తెలిపాయి. బీజేపీ కాంగ్రెస్ అంతర్గతంగా చేసుకొన్న సర్వేల్లో కూడా టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే ఫలితం వచ్చింది. బీజేపీది మూడో స్థానమనే విషయం కూడా ఈ సర్వేలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం ఆరు శాతం (12 వేలు) ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు వెయ్యో రెండు వేలో పెరుగొచ్చేమో తప్ప అంతకు మించి పడే అవకాశాలు ఎంతమాత్రం లేవని కూడా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ దారుణ ఓటమిని తట్టుకోవడానికి.. మునుగోడు ఎన్నికలను ఏదోరకంగా ప్రభావితం చేయడానికి పలు విధాలుగా బీజేపీ కుయుక్తులు పన్నుతున్నది. మొదట ఓటర్ల జాబితాను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నించి అత్యున్నత స్థానంలో భంగపడింది. తాజాగా కారును పోలిన గుర్తుల కేసు విషయంలో హైకోర్టులో ఇంప్లీడ్ కాబోయి చీఫ్ జస్టిస్‌తో చీవాట్లు తిన్నది.
మరోవైపు డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున తరలిస్తున్నది. రెండు రోజుల క్రితం కరీంనగర్‌కు చెందిన బండి సంజయ్ ప్రధాన అనుచరుడు కోటి రూపాయల నగదును మునుగోడుకు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే.. ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఓటర్ల మద్దతు తమకు దక్కడం లేదని బీజేపీ నేతలకు అర్థమైంది. దీంతో రోడ్‌షోలకు బయటినుంచి జనాలను తరలించి ఎన్నికలను ప్రభావితం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం దాదాపు వంద కార్లతో మునుగోడు పర్యటనకు వెళ్లారు. సంజయ్ రోడ్ షోలో స్థానిక జనం లేరని, బయటినుంచి తరలించినవారే ఉన్నారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా బీజేపీ ఇలా వందలాది కార్లలో వేలాదిగా బయటి జనాలను తరలిస్తుంటే.. ఎన్నికల సంఘం ఏం చేస్తున్నదని టీఆర్ఎస్ ముఖ్యనేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఆడిస్తున్న బీజేపీకి దాని శైలిలోనే జవాబు చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్టు టీఆర్ఎస్ ముఖ్యులు సంకేతాలిచ్చారు.
ఇందులో భాగంగానే భారీ వాహన శ్రేణితో మునుగోడుకు వెళ్లి.. అక్కడే మకాం వేసి తాడోపేడో తేల్చుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. అవసరమైతే ప్రచార గడువు ముగిసేలోపు మునుగోడులో ఉన్న ప్రతి పల్లెను, ప్రతి తండాను చుట్టివచ్చి బీజేపీ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్టు చెప్తున్నారు. బీజేపీ అభ్యర్థి నియోజకవర్గానికి ఏం చేశాడని ఓట్లు పడతాయని.. కనీసం డిపాజిట్ ఎలా వస్తుందో చూస్తామని అన్నట్టు పేర్కొన్నారు. ‘మునుగోడులో బీజేపీ ఎక్కడిది? వారికి ఉన్న బలం ఎంత? కాంట్రాక్టర్‌ను రంగంలోకి దించి.. కాంట్రాక్టుల డబ్బులిచ్చి.. వాటిని పంచి ప్రజలను మోసపుచ్చే ప్రయత్నం చేస్తారా? వందలాది కార్లు పెట్టి , బయటి నుంచి జనాలను తరలించి స్థానికులను మసిపూసి మారేడు కాయ చేస్తారా? బండి సంజయ్ మునుగోడుకు వెళ్లి మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేస్తారా? ఇదంతా జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది? ఈసీకి బీజేపీ వ్యవహారం కనిపించడం లేదా? కండ్లకు గంతలు కట్టుకొన్నదా? ఈ అరాచకాలకు చరమగీతం పాడాల్సిందే.
ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగుతా.. ఏం జరుగుతుందో చూద్దాం’ అని కేసీఆర్ ఢిల్లీలో తనతోపాటు ఉన్న ముఖ్యులతో వ్యాఖ్యానించినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మునుగోడు ఉప ఎన్నికే భారత రాష్ట్ర సమితి కార్యకలాపాలకు, రాజకీయ దీక్షా దక్షతలకు వేదికగా మారుతుందని, ఇందులో ఆశ్చర్యం లేదని కూడా కేసీఆర్ అన్నట్టు టీఆర్ఎస్ పేర్కొన్నాయి. అక్కర్లేని ఉప ఎన్నిక ఒకటి తెచ్చి.. దాని ద్వారా కేసీఆర్‌ను కట్టడి చేయాలంటే అది జరిగే పని కాదని టీఆర్ఎస్ ముఖ్యులు పేర్కొన్నారు. ఒక సవాలును అవకాశంగా మార్చుకొని అద్భుత విజయం సాధించడం ఎట్లాగో కేసీఆర్‌కు తెలుసని.. 2006లో కరీంనగర్ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని నమోదు చేసిన సందర్భాన్ని గుర్తుచేస్తున్నారు. మునుగోడులో కూడా బీజేపీకి తీరని భంగపాటు ఎదురవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.