Political తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ బాటలోనే నడిచిన ఆ వ్యక్తి… తన ఇంటి ఆడపిల్లకు ఆ నాయకుడి చేతనే పేరు పెట్టించాలని నిర్ణయించారు. ఇది ఇప్పటి మాట కాదు… తెలంగాణ ఉద్యమం చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయం. ఇన్నాళ్లకు ఆ కల నిజమైంది. తమ ముద్దుల పాపకు… తన ఆరాధ్య నాయకుడి చేతనే నామకరణం చేయించి… తమ కోరికను నెరవేర్చుకున్నాడో… తండ్రి.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ తలిదండ్రుల కలను నెరవేర్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని 9 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రుల కోరికను నెరవేర్చారు.. అంతే కాకుండా వారికి కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించారు. పాప చదువుకు కావలసిన ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులకు 2013లో ఓ పాపకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు తెలంగాణ ఉద్యమసారథి సీఎం కేసీఆర్‌తోనే నామకరణం చేయించాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం కారణంగానే ఇప్పటి వరకు ఆ పాపకు పేరు పెట్టలేదు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి వారిని కేసీఆర్ దగ్గరకు తీసుకువెళ్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే పాపతో పాటు ఆ తల్లిదండ్రులను ఆదివారం ప్రగతిభవన్‌కు తీసుకువచ్చి… కేసీఆర్‌తో మాట్లాడిచ్చారు.
సురేశ్, అనిత దంపతులను దీవించిన కేసీఆర్ దంపతులు…. వారి తొమ్మిదేళ్ల పాపకు ‘మహతి’ అని నామకరణం చేశారు. అంతే కాకుండా నూతన వస్త్రాలు బహూకరించి, సంప్రదాయ పద్ధతిలో ఆతిథ్యమిచ్చారు. ఆ పాప చదువుకు కావాల్సిన ఆర్థిక సాయం అందించారు. తొమ్మిదేళ్ళ నుంచి ఎదురుచూస్తున్న తమ కల నెరవేరడంతో ఆ దంపతులు ఎంతో ఆనందపడ్డారు.