Cm Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటిస్తున్నారు. కాగా దేశం లోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా, 2 వేల గ్రామాల రైతులకు జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ చేయనున్నారు. దశల వారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 డిసెంబర్ 21న వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ప్రారంభించింది. డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్లు, జీఎన్‌ఎస్‌ఎస్ రోవర్స్ వంటి అత్యాధునిక సర్వే సాంకేతికతలను ఉపయోగించి ఈ సమగ్ర రీసర్వేని దేశంలోనే ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం అనే చెప్పాలి. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 47,276 చ.కి.మీ పరిధిలోని 6,819 గ్రామాల్లో డ్రోన్ ఫ్లయింగ్ పూర్తయింది. నేటికి 2000 గ్రామాల్లో రీసర్వే కార్యకలాపాలు పూర్తయ్యాయి. అలాగే 1835 గ్రామాల్లో 7,29,381 మంది రైతులకు భూ హక్కు పత్రాలు రూపొందించారు.
భూ హక్కు పత్రం అందించడం ద్వారా భూ యజమానులకు హక్కు భద్రత కల్పించడం, 5 సెంమీ లేదా అంతకంటే తక్కువ ఖచ్చితత్వంతో జియో–రిఫరెన్స్ కోఆర్డినేట్‌ల ఆధారంగా భూ రక్ష సర్వే రాళ్లను నాటడం ద్వారా భూమికి భౌతిక భద్రత కల్పించడం ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలుగా చెబుతున్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో ప్రారంభించబడింది అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. డిసెంబర్, 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.