CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య–2022’ పురస్కారాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ లోని A1 కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా సీఎం జగన్, ఆత్మీయ అతిథిగా వైఎస్ వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వివిధ రంగాల్లో సామాజిక అభ్యున్నతి కోసం విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రధానం చేశారు.
ఏపీ ప్రభుత్వం రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. అలానే వైఎస్సార్ సాఫల్య అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహూకరించారు. వ్యవసాయం రంగంలో 5, సాహిత్యం రంగంలో 3, జర్నలిజం విభాగంలో 4, కళలు–సంస్కృతి రంగంలో 5, మహిళా, శిశు సాధికారత రంగంలో 3, విద్య రంగంలో 4, వైద్య రంగంలో 5 , పరిశ్రమల విభాగంలో 1 అవార్డును ప్రధానం చేశారు.
ఈ సంధర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… దేశంలో మరే రాష్ట్రం లోనూ లేని విధంగా అన్ని రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఏపీలో అవార్డులు ఇస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు వారధులుగా ఉన్న వారికి అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. వెనక బాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులు, పాత్రికేయులు, పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులు అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. అవార్డులను అందుకున్న వారికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు.