ఏపీలో కొత్త ఫిలిం పాలసీ.. కొత్త మార్పులు ఇవే..!
New Film Policy : ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత పదేళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి వెనకడుగు వేస్తున్న సినిమా రంగానికి ఇప్పుడు పెద్ద పీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాలికలు సిద్దం చేస్తోంది. గత పదేళ్ళలో ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రవేశ పెట్టినా ప్రచారానికి సినిమా పరిశ్రమ ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. స్వచ్ ఆంధ్రప్రదేశ్, నీరు చెట్టు, పచ్చదనం పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ఏపీ సర్కార్ తీసుకొచ్చినా సినిమా వాళ్ళు ముందుకు రాలేదు.
కాని హరిత హారం, మిషన్ భగీరధ వంటి వాటిని ఫ్రీ గా ప్రమోట్ చేసారు. ఇప్పుడు సినిమా వాళ్ళను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. నూతన ఫిల్మ్ పాలసీ తీసుకొచ్చే దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తుంది. సచివాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. సంబంధిత ప్రతిపాదనలతో రావాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. సమగ్ర నివేదిక వచ్చాక సినిమా రంగంతో కూడా చర్చించి అడుగులు వేయడానికి సిద్దమయ్యారు.
ప్రతిసారి సినిమా టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే విషయమై కూడా వివాదాలు తలెత్తుతున్న నేపధ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. టికెట్ ధరల పెంపు విషయంలో దీర్ఘకాలికంగా ఒక విధానం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్టు సమాచారం. చిన్న సినిమాలకు కూడా ప్రోత్సాహం అందించాలని సర్కార్ భావిస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పరిణామ క్రమాన్ని, చెన్నై నుండి హైదరాబాద్ కు తరలివచ్చిన అంశం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఏపీలో స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్స్, రీరికార్డింగ్ థియేటర్ల ఏర్పాటు అంశంపై కూడా ప్రభుత్వం పలు ప్రతిపాదనలు సిద్దమైన తర్వాత కీలక నిర్ణయం తీసుకొంది. అలాగే లఘు చిత్రాలను కూడా ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. సినిమా రంగంపై ఆసక్తి ఉన్న యువతను కూడా ప్రోత్సహించేందుకు సర్కార్ సిద్దమవుతోంది. విశాఖ, చిత్తూరులో సినిమా పరిశ్రమకు అవకాశాలు కల్పించే దిశగా స్టూడెంట్ నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. మారేడుమిల్లి, అరకు, హిందూపురం లేపాక్షి, తిరుమల దగ్గర ఉండే పర్యాటక ప్రదేశాల్లో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు సిద్దంగా ఉంది. షూటింగ్ లకు రాయితీలు ఇచ్చే అడుగులు వేయాలని సర్కార్ భావిస్తోంది.