సమ్మక్క- సారలమ్మలు దేవుళ్లా.. వాళ్లేమైనా బ్రహ్మలోకం నుంచి ఊడి పడ్డారా? : చిన్న జీయర్ స్వామీ
మనమంతా తొలి రాజుల్లో ఆదివాసీలమే వనజనులమే.. ఆ సమయంలో మనమంతా ప్రకృతి ఆరాధకులమే, ఎవరూ ఎక్కడా బ్రహ్మలోకం నుంచి ఊడిపడిందే లేదు. ఎప్పుడైతే మన ఆదివాసి- మూలవాసీ తొలి సైంటిస్టు నిప్పు కనుగొన్నాడో ఈ ప్రంపంచ స్థితి- గతి- అతి వేగంగా మారుతూ వచ్చి ఇదిగో ప్రస్తుతం ఇక్కడకొచ్చి నిలబడ్డాం మనమందరం..!!! వనం లేనిదే మనం లేం, ప్రకృతి లేనిదే ఇవేవీ లేవు, ఒక రకంగా చెబితే దైవం మానవ రూపేణా అంటుంటారు, మానవ సేవే మాధవ సేవన్నది చిన్నజీయర్ల వారికీ తెలియంది కాదు.. మనకు ఈ ఆరాధన ఎప్పటి నుంచి మొదలైందంటే.. ఒక మనిషి పది మంది కోసం ప్రాణాలకు తెగించి మరీ పాకులాడినపుడు వారిపై మనకు అపారమైన ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి..దీంతో మనిషిలో మనకు దైవత్వం కనిపిస్తుంది, అందుకే నువ్వు దేవుడివిరా సామీ! అంటుంటాం, ఒక సాధారణ మనిషి చేయలేని పనిని ఎరైనా చేస్తే దానికి దైవత్వం ఆపాదిస్తుంటాం.. అలాంటి ఆపాదనలతో మనకు గ్రామదేవతల ఆరాధన మొదలైంది.. చాలా మంది గ్రామదేవతలు మనుషులుగా ఉండి తర్వాత వారు పరమపధించిన తర్వాత దేవతలుగా మొక్కడం మొదలు పెట్టారీ జనం. ఇది మన ఆది సంస్కృతి, సంప్రదాయం, ఇందులో మరెక్కడా లేదు భిన్నాభిప్రాయం…
సాయిబాబా అలాంటివారే దత్త సంస్కృతిలో చాలా మంది అవధూతలు అలాంటివారే.. అందుకే ఒక పెద్దాయన సాయిబాబా దేవుడు కాడని అంటూ అప్పుడప్పుడూ వార్తలకెక్కుతుంటాడు, ఆ మాటకొస్తే కొందరు బ్రహ్మలోక సిద్ధాంతం ప్రకారం అయ్యప్పను కూడా దేవుడు కాడని అంటారు..ఇలా మాట్లాడితే వాసవీ కన్యకా పరమేశ్వరి.. ఊరూరా కనిపించే గ్రామదేవతల్లో చాలా మంది ఒకానొక కాలంలో జీవించి.. పది మంది కోసం నిలబడి.. ఒక నిజాయితీకి సత్యానికీ మారుపేరుగా నిలవడం వల్ల తర్వాతి తరాల్లో కూడా వారి పేరు బలంగా వినిపించడంతో వాళ్లే దేవీ దేవతలుగా ఆరాధించబడ్డం.. మన జీవనాచారంలో ఇదొక రివాజు. సమ్మక్క- సారలమ్మలు కూడా సరిగ్గా అలాంటి వారే.. వీరిద్దరూ తమ అడవి మనుషుల కోసం- నాటి రాజ్యానికి ఎదురు నిలిచిన వారే.. వీరిలో ఒకరైన సమ్మక్క- సీతమ్మవారిలా అయోనిజగా పుట్టినట్టు చెబుతోంది వన చరిత్ర. పోరాటం తర్వాత అంతర్ధానమై ఇప్పటికీ పసుపు కుంకుమలుగా వీరు భాసిల్లుతూ భక్త జనుల కోరికలు ఈడేరుస్తున్న వారే.. అలాంటి వీరు బ్రహ్మలోకం నుంచి ఏవైనా ఊడిపడ్డారా? అంటే ఖచ్చితంగా ఊడి పడలేదు.. ఆ మాటకొస్తే అవధూతలూ, స్వామీజీలైన మీరెవరు?
దైవాంశ సంభూతులుగా చలామణీ కావట్లేదా? ఒక దశలో మన దగ్గర బాబాలు, స్వామీజీలు సాక్షాత్ ఆయా దేవీ దేవతల స్వరూపాలుగా పూజలందుకోలేదా? వారిలో ఎందరో డేరా బాబాలు, ఆశారాం బాపూజీల్లేరా? ఆ మాటకొస్తే పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో హత్యకేసు సంచలనం సృష్టించలేదా? ఇంకా ఎందరో స్వామీజీలు, బాబాల పీఠాల్లో ఆశ్రమాల్లో ఎన్నో అవకతవకలు బయట పడలేదా? వీళ్లందరికన్నా వెయ్యి రెట్లు సమ్మక్క- సారలమ్మలు నిజాయితీ పరులు.. నిజంగా చిన్నజీయర్ కి చిత్త శుద్ధి ఉంటే.. ఈ బాబాకల్చర్ లో ఉన్న ఇలాంటి దారుణ మారణ కాండను ఎండగట్టాలి.. తనకు తాను స్వయంగా ఒక దైవాంశ సంభూతుడిగా అభివర్ణించుకుని ఎందరో భక్తులను తన వశం చేసుకుని వారి నుంచి కావల్సినంత ధన కనక వస్తు వాహనాదులను ఆకర్షించడం పూర్తిగా మానాలి..కానీ అలా చేస్తున్నాడా? అంటే ఆఖరున పెద్ద మనిషి ఫంక్షన్లకు వెళ్లి.. అక్కడ ఐదు లక్షల రూపాయలు ఇస్తే తీసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు జనం..ఎంత సిగ్గు చేటు??? సరే రామానుజ విగ్రహ ప్రతిష్టాపన వ్యవహారంలో డబ్బు అవసరమై చేశాడనుకుందాం.. మిగిలిన విషయాల మాటేంటి???
ఇదే సమ్మక్క సారలమ్మలను విమర్శించేటపుడు.. బాబాలు, స్వామీజీలు, పీఠాధిపతుల ఆశ్రమాల్లో జరిగే అవకతవకలపై ఏనాడైనా ఇలా విమర్శించారా? జీయర్ సార్.. ఎంతైనా మీరు ఆత్మ విమర్శ చేసుకోవల్సిన అవసరం ఉంది !!! ప్రత్యేక కధనం Author: Journalist Audi