జనరల్ గా పెళ్లి కొడుకు సరిగ్గా పెళ్లి కూతురి మెడలో మూడు ముళ్లు వేయబోతుండగా ‘ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు.’ అంటూ పోలీసులో, మరే ఇతర క్యారెక్టర్లో వచ్చేవి. కానీ, ఇక్కడ కన్న కొడుకులే వచ్చి తండ్రి పెళ్లిని ఆపడమే గాదు, తండ్రి వీపుపై విమానం మోత మోగించారు. వినడానికి విచిత్రంగానే వున్నా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ లో ఈ సంఘటన నిజంగా జరిగింది.
ఓ రోడ్ కాంట్రాక్టర్ ముందు ముచ్చటపడి ఓ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకో ఇద్దరి మధ్యా మనోభావాలు దెబ్బతిని విడిపోయారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఏడుగుర్ని కన్నాడు. ఓ ఆరు నెలలుగా రెండో భార్యకు దూరంగా వుంటున్నాడు. మనం రోజూ భోజనం చేసినట్టుగా, మందుబాబులు రోజూ మందు కొట్టినట్టుగా అతగాడికి రెగ్యులర్ గా మూడు ముళ్లు వేయడం మీద మూడ్ పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గలేదు. అందుకే, గుట్టు చప్పుడు కాకండా మరో రెండు పెళ్లి చేసేసుకున్నాడు.
అలా కంటిన్యూ అయిపోదామనుకున్నాడో ఏంటో… 55 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి రెడీ అయిపోయాడు. ముచ్చటగా వరుడిలా ముస్తాబై ఇక పెళ్లి పీటలెక్కి వధువు మెడలో తాళి కట్టబోతూండగా ఈ విషయం కాస్తా అతడి రెండో భార్యకూ, పిల్లలకూ, బంధువులకూ తెలిసిపోయి మండిపడి ఆగమేఘాల మీద వచ్చేశారు. తమకు పెళ్లిళ్లు చేయాల్సిన వయసులో సిగ్గు లేకండా ఎంచక్కా ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రిని చూడగానే వాళ్లకు అరికాలి మంట నెత్తికెక్కింది. కన్నతండ్రి అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి చితక్కొట్టేశారు. పెళ్లి మంటపం కాస్తా గందరగోళంగా మారడంతో పెళ్లికూతురు భయపడి పారిపోయింది. విషయం తెలిసి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అక్కడికొచ్చి నిత్య పెళ్లికొడుకును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.