పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ రీసెంట్ రిలీజ్ బ్రో BRO…. ప్రేక్షకుల ముందుకొచ్చి ఉర్రూతలూగిస్తోంది. ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతున్నారు.. హాళ్ల మధ్యలో లేచి తెరలు చించే వాళ్లు కొందరైతే.. విజిల్స్ చప్పట్లతో సరి పెట్టకుండా కాగితాలు విసిరే వారు ఇంకొందరు. అత్యుత్సాహంతో.. తెర ముందుకొచ్చి గందరగోళం చేసేవాళ్లు మరి కొందరు.
ఇలాంటి వాళ్లందరినీ హాల్లోనుంచి బయటకు తరుముతూ.. పోలీసులు ఉరికించి ఉరికించి కొట్టిన దృశ్యాలు పదే పదే దర్శనమిచ్చాయి. దీంతో ఒక సైనికుడు(తాగుబోతు) ఫోన్ బద్దలు బద్ధలై పోయింది. అంతే కాదు ఒక పిల్ల సైనికుడైతే.. ఏకంగా అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టాప్ ఎక్కి.. జెండా ఊపడంతో.. పోలీస్టేషన్ మెట్లు ఎక్కిన దుస్తితి. ఆడపిల్లలు (వీర యువతులనుకుంటా) కూడా రోడ్డు మీదకొచ్చి.. పవన్ కళ్యాణ్ తోపు.. జనసేన జెండా ఊపు అంటూ ఊగిపోవడమూ కనిపించింది.
కట్ చేస్తే………
మనమిక్కడో కట్ తీసుకుంటే.. స్టోరీ ఏంటి? రివ్యూ ఎలా ఉంది? ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ మూవీనా.. లేక అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించగల చిత్రమా? ఇలా రకరకాల డౌట్లు. ఏది ఏమైనా యావరేజ్ టాక్ అయితే నడుస్తోంది.. ఆడియన్స్ సర్కిల్స్ లో. ఇదంతా సరేగానీ.. ఈ సినిమా కథ చెప్పే నీతి ఏంటి బ్రో!? అని ప్రశ్నించుకుంటే.. ఈ స్టోరీ ఏతా వాతా చెప్పుకుంటే.. ఈ ప్రపంచంలో నీదేం లేదు. అంతా ఆ పైవాడి దయ. అతడి చేతిలోని కాల చక్రమహిమ. అన్నది ఫైనల్ గా మనం తేల్చి చెప్పుకోవల్సిన ముచ్చట.
బేసిగ్గా ఈ మూవీ స్టోరీ ద్వారా.. పవన్ ఏం చెప్పదలుచుకున్నాడని ఒక పొలిటికల్ అంచనా వేస్తే. జగన్ కి ఆయనేదో లీలగా ఒక మెసేజ్ సప్లై చేయాలని చూసినట్టు తెలుస్తోంది. అదేంటంటే.. 151 సీట్లతో గెలిచిన నీ గెలుపు కూడా నామమాత్రమే. అంతే కాదు ఏపీ నువ్వు లేకుండా కూడా హ్యాపీగా ఉండగలదని చెప్పడానికి ట్రై చేసినట్టు కనిపిస్తోంది.
దీన్నిబట్టీ చూస్తే పవన్ కళ్యాణ్.. ఆయన మేనియా.. ఇదంతా కూడా ఏమీ లేదు. ఏదో అలా కుదిరిందంతే అనుకోవాలా? ఇందులో పవన్ కళ్యాణ్ ప్రమేయమేం లేదని మనల్ని మనం నచ్చచెప్పుకోవాల్నా? ఇదో ప్రశ్న
అయితే.. రెండో ప్రశ్న.. ఈ సినిమా లోని నీతి ప్రకారం మాట్లాడుకుంటే.. పవన్ కళ్యాణ్ ప్రభావంతో టీడీపీ 2014లో గెలిచిందని చెప్పడానికి కూడా వీల్లేదు. 2019లో తాను లేక పోవడం వల్లే టీడీపీ ఓడిందనడానికీ కుదరదు. ఈ చిన్న లాజిక్ పవన్ కళ్యాణ్ స్టోరీ ఓకే చేసే ముందు ఎలా మిస్సయ్యాడో అర్ధం కాదు. ఏది ఏమైనా ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర నిమిత్తమాత్రంగానే ఉంటుంది. ఆయన తాను చేసే రాజకీయాల్లో ఎప్పుడూ కోరుకునే ప్రేక్షక పాత్ర ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందనే వారున్నారు.
ఎందుంటే ఈ మూవీ స్టోరీ ప్రకారం చూస్తే.. ఆయన పాత్ర టైం మేన్. అంటే కాల పురుషుడు. ఆ నలుగురు.. సినిమాకి ఇది కొంత అప్ డేటెడ్ వర్షన్. ఆ పాత్ర.. చనిపోయాక.. అదృశ్యంగా వచ్చి.. తన చుట్టూ ఉన్న బంధుమిత్రులు, వారి వారి మానసిక స్థితిగతులను పరిశీలించి చూస్తుంది..
ఈ సినిమాలోని ప్రధానపాత్ర(సాయి ధరమ్ తేజ్) తన వెంట నడుస్తోన్న కాలపురుషుడిని (పవన్) అడిగి ఒక 90 రోజుల గ్రేస్ పీరియడ్ తీస్కుంటాడు. అక్కడ పరోక్షంగా అయితే ఇక్కడ ప్రత్యక్షంగా తన చుట్టూ ఉన్న బంధుమిత్రుల స్థితిగతులను అబ్జర్వ్ చేయడమే ఈ సినిమా ప్రధానపాత్రధారి చుట్టూ అల్లిన కథ. అదంతా చూసి అతడు భరించలేక.. బతికి చచ్చాను అనే కీ డైలాగ్ వాడుతుంటాడు.
కాలం తీరిన వాడి పాత్రలో సాయి ధరమ్ తేజ్- అతడికి 90 రోజుల గడువు కాలాన్నిచ్చే కాల పురుషుడి పాత్రలో.. పవన్ కళ్యాణ్.. నటించగా.. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత సినిమాలో ఏమంత ఎక్కువ కనిపించదు. అయితే ఈ సినిమా ద్వారా తన వింటేజ్ లుక్స్.. తన డైహార్డ్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు పవన్..
థియేటర్ల దగ్గర చూస్తే.. పవన్ ఫ్యాన్స్ హంగామా అంత తక్కువగా ఏం లేదు. జగన్ ని చాలా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరూ. ఈసారికి సీఎం పవన్ పక్కా అంటూ హోరెత్తిస్తున్నారు.. వీటన్నిటినీ బట్టీ చూస్తే.. పవన్ అభిమాన గణం స్పష్టమైన సంకేతాలనే ఇస్తున్నట్టు కనిపిస్తోంది.
బేసిగ్గా బ్రో సినిమా స్టోరీ సో క్లాస్. అదొక కాలం విలువ చెప్పే తత్వానికి సంబంధించినది. ఈ కాల మహిమా అది చెప్పే తొక్కలో తత్వం తలకెక్కించుకునే అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. కాకుంటే తమ ఆరాధ్య దైవానికి పాలాభిషేకాలు చేసి.. పూనకాలు తెచ్చుకుని.. స్టారాది స్టారుడా.. పవరాధి స్టారుడా.. అంటూ ఆరాధించుకోడానికి.. ఈ బ్రో సినిమా విడుదలొక వేదిక.
అంతే తప్ప.. సినిమా చెప్పే నీతి ఏమి బ్రో! అని తమ డెమీ గాడ్ చెప్పదలుచుకున్నదాని గురించి విడమరచి మాట్లాడుకుంటున్న అభిమాని.. గాడే లేడు. ఒకడైతే.. ఫస్టాఫ్ పీకింది బ్రో. సెకండాఫ్ కళ్యాణ్ బాబు ఉన్నంత సేపు.. కాస్త ఎంటర్టైన్మెంట్. పర్లా.. పైసా వసూల్. ఒకసారి చూడొచ్చు. మిగిలిందేదీ.. మనకర్ధం కాదని కుండ బద్దలు కొట్టేస్తూ కనిపించాడో డైహార్డ్ ఫ్యాన్ బ్రో. ఇదీ పవన్ కళ్యాణ్\ సాయి ధరమ్ తేజ్ సినిమా స్టోరీ చెప్పే నీతి.. బ్రో!