యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శృతి హాసన్, మౌనీ రాయ్, శంకర్ కూతరు అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘28 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా టైంలో నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాలి. ఆ టైంలోనే శంకర్ ఇండియన్ కథతో వచ్చారు. రెండు కథలు కొంచెం దగ్గరదగ్గరగా ఉన్నాయి. అదే విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పాను. ‘శంకర్ గారితోనే సినిమా చేయండి.. ఆయన ఆల్రెడీ ఓ సినిమాను తీశారు. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. ఆయన అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతోనే శంకర్ గారితో ఇండియన్ సినిమా చేశాను. ఆ టైంలో నేను గానీ, శంకర్ గానీ రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుకోలేదు. ఏ ఎం రత్నం గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ టైంలోనే నేను శంకర్ గారితో సీక్వెల్ గురించి మాట్లాడాను. కానీ శంకర్ గారు మాత్రం కథ రెడీగా లేదని అన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 28 ఏళ్ల తరువాత ఇండియన్ 2 చేశాం.
ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చిందంటే లైకా అధినేత సుభాస్కరన్ గారే కారణం. ఎన్నో సవాళ్లు ఎదురైనా మాకు అండగా నిలిచారు. ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ చిత్రం. ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే ఈ సినిమాను మేం చేశాం. మా చిత్రానికి సపోర్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్, తమిళ కుమరన్, సెంబగ మూర్తికి థాంక్స్. కాజల్, రకుల్, సిద్దార్థ్, ఎస్ జే సూర్య, సముద్రఖని ఇలా అందరూ అద్భుతమైన పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది. ఆయన అద్భుతమైన పాటలు ఇచ్చారు. రవి వర్మన్ నాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఉన్న టైం నుంచీ తెలుసు. ఆయన అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇండియన్ సినిమాకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది. నాకు సహకరించిన టీం మెంబర్స్ అందరికీ థాంక్స్’ అని అన్నారు.