ఈ సినిమా చూస్తే.. నక్సలిజం ఎంత కఠినమైనది.. వీళ్లు దేశ మధ్య భాగంలో ఉంటూ.. దేశ జెండా ఎగరడాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారు.. అన్న అంశాన్ని ఎక్స్ ప్లోర్ చేస్తుందీ చిత్రం. ఈ చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ తీసిన ప్రతి ఫ్రేమ్.. క్లైమ్యాక్స్ లా ఉంటుంది.. ఎక్కడ ఈ బిట్ చూడ్డం మిస్సయితే.. ఏ ఇన్ఫో మిస్ అవుతామో అన్నంత పకడ్బందీగా సినిమా చిత్రణ చేశాడు సుదీప్తో.
ఇట్స్ రియల్లీ వండ్రఫుల్ స్టోరీ- స్క్రీన్ ప్లే వర్కవుట్. ఈ మధ్య కాలంలో వచ్చిన గామీ కీ ఈ సినిమాకీ ఒక పోలిక ఉంది. అదేంటంటే.. సినిమాలో వేరియస్ లొకేషన్స్ లో వేరియస్ సీన్స్ తో స్టోరీ నడుస్తుంటే.. వాటిని ఎప్పుడు- ఎక్కడ- ఎలాంటి బిట్ కట్స్ వేయాలో.. చెప్పే చిత్రాలివి.
కోర్టు వాదనలతో మొదలయ్యే బస్తర్.. క్రమేణా ఒక నక్సల్ గ్రూప్ మరో కుటుంబ గాథ.. కేంద్రంగా సాగుతుంది. గ్రామంలో భారత జెండా ఎగురవేశాడనే ఆరోపణ మీద.. మిలింద్ కాశ్యప్ అనే ఒక వ్యక్తిని అతడి కుటుంబం ముందే తెగ నరుకుతాడు.. లంకరెడ్డి అనే నక్సల్ గ్రూప్ లీడర్. అక్కడి నుంచి ఆ మృతుడి భార్య రత్న.. పడే పాట్లు వర్ణనాతీతం. నక్సల్స్ ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటారా ? అని ఎత్తి చూపుతుందీ చిత్రం.
ఒక పక్క భర్తను కోల్పోడం మాత్రమే కాదు.. తన కొడుకును కూడా దళంలోకి లాగేసుకుటుందీ ముఠా. దీంతో ఆమె తన ఖండిత భర్త మృతదేహంతో కూడిన బుట్ట నెత్తిన పెట్టుకుని ఊళ్లోకి ఆమె వచ్చే సన్నివేశాన్ని జీర్ణించుకోవడం చాలా చాలా కష్టం. అలా అలా సినిమా నీరజా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్, సల్వా జుడం రాజేంద్ర కర్మ ఇలా కొన్నంటే కొన్ని ప్రత్యేక పాత్రలతో ముందుకు సాగుతూ గుండెలను మెలిపెట్టేస్తూ పోతుందీ సినిమా.
ఈ సినిమా ద్వారా మనకు అర్ధమయ్యే విషయం ఏంటంటే.. ఇది చాలా లోతైన చర్చ. కమ్యూనిజాన్ని అడ్డు పెట్టుకుని కొందరు సామాజిక కార్యకర్తలుగానీ, లాయర్లు, న్యూస్ యాంకర్లు, రచయితలు.. ఇతరత్రా.. ఎలా సొమ్ము చేసుకుంటారన్న అంశాన్ని ఎత్తి చూపుతుంది బస్తర్ అనే ఈ నక్సల్ స్టోరీ. అంతే కాదు ఈ సినిమాలోని మెయిన్ విలన్ పాత్రధారి లంకరెడ్డి అయితే.. 24 గంటలూ డబ్బు గోలే.
ఒకే సారి 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోత.. అత్యంత దారుణమైన ఘటనగా ఎత్తి చూపుతుందీ చిత్రం. నక్సల్ పేరిట, కమ్యూనిజం పేరిట దేశ నడిబొడ్డున విదేశీ భావజాలంతో ఈ ముఠా చెలరేగిపోవడాన్ని కళ్లకు కట్టించాడు చిత్ర దర్శకుడు సేన్. నిజంగా మనమంతా ఈ నక్సల్స్ పట్ల.. అయ్యొయ్యో.. చుచ్చుచ్చూ.. అనే జాలి దయతో కూడిన నిట్టూర్పులు విడుస్తూ.. పోలీసులే ప్రధాన ప్రతినాయకులుగా భావిస్తుంటాం కానీ… ఈ సినిమా ద్వారా.. పోలీసులు మన కోసం.. మన రోడ్లు- మన స్కూళ్లు.. మన వసతి సౌకర్యాల కోసం అడవుల్లో ఎంత భయంకరమైన యుద్ధం చేస్తుంటారో చెబుతుంది ఈ సినిమా.
నీరజా మాధవన్ అనే ఐపీఎస్.. చత్తీస్ ఘడ్ హోం మంత్రితో భేటీ సన్నివేశం చాలా చాలా రోమాంచితంగా ఉంటుంది. తమపై అటాక్ జరగబోతుందని.. అర్ధరాత్రి బ్యాకప్ కోసం హోం మంత్రిని, డీజీపీని అడిగితే.. వాళ్లెంత రెక్ లెస్ గా సమాధానం చెబుతారు ? ఆపై అదే దుర్ఘటనపై పోలీసులపైనే ఎలాంటి నింద వేస్తారు ? కళ్లకు కట్టించాడు దర్శకుడు.
పైపెచ్చు నీరజ అనే ఆ పోలీసు అధికారిణిని తీవ్ర పరుష పదజాలంతో తిడుతూ.. సస్పెన్షన్ ఆర్డర్ టైప్ చేయిస్తాడు హోం. నిజానికి నక్సలిజం ద్వారా.. నాయకులకు లాభమే అన్న కోణం కనిపిస్తుందిక్కడ. వారిని అడ్డు పెట్టుకుని.. పొందే లబ్ధి, ఫండ్స్ కోసం పోలీసుల ప్రాణాలు చెలగాటం ఆడుతారు కొందరు రాజకీయ నాయకులన్న అంశాన్ని కూడా ఎస్లాబ్లిష్ చేస్తుందీ చిత్రం.
ఇక ఇదే సినిమా ద్వారా బస్తర్ ప్రాంతంలో సల్వా జుడం. దాని ఆవశ్యకతను కూడా డిస్క్రయిబ్ చేస్తుందీ చిత్రం. ఒక ఫేక్ టీవీ యాంకర్, తన పక్కన వామపక్ష భావజాలం గల వన్య రాయ్ అనే రచయిత్రిని పక్కన పెట్టుకుని ఆడించే చర్చా నాటకం. తద్వారా.. జనం ముందు ఎవరైతే బాధితులున్నారో.. వారినే నిందితులు గా చూపించే యత్నం వంటి ఎన్నో అంశాలను ఆసక్తికరంగా మలిచాడీ చిత్ర దర్శకుడు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే వర్శిటీల వేదికగా.. ఈ వామపక్ష భావజాలీకులంతా కలసి ఒక పథకం ప్రకారం.. అన్నెంపున్నెం తెలియని అమాయక విద్యార్ధులను ఎంత గొప్పగా.. తమ వైపునకు ఆకర్షించుకోగలరు ? వారి ఉడుకు రక్తంలో పొంగిపొర్లే.. సోకాల్డ్ విప్లవాన్ని చూసి వీరి నరనరాల్లో ఎంతగా జువ్వు మంటుంది? అనే అంశాన్ని కూడా ఎంతో బాగా చిత్రణ పట్టాడు దర్శకుడు.
ఒక సమయంలో ఇది సినిమా చూస్తున్నట్టుగా ఉండదు మనకు. అచ్చం మనం కూడా బస్తర్ దండకారణ్యంలోకి వెళ్లి.. అక్కడ నిజ జీవన పాత్రల మధ్య తిరుగుతున్నామా! అనిపిస్తుంది. ఒక తల్లి తన భర్త మృతి కి ప్రతీకారం తీర్చుకోడానికి పోలీసు దళంలో చేరితే.. అదే తల్లి కన్న కొడుకు బలవంతానా.. నక్సల్ గ్రూపులోకి వెళ్తే.. ఒకానొక సమయంలో .. వారిద్దరూ ఒకరి గుండెలకు మరొకరు తుపాకీ గురి పెడితే ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఈ సినిమా తప్పక చూడాల్సిందే..
ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాతలు ఖచ్చితంగా నక్సలైట్లు వారి హింసాత్మక జీవన సరళి.. వారి వెనక బ్యాకప్ గా పని చేసే అర్బన్ నక్సలైట్ బ్యాచీ.. వాళ్లు అడవుల్లో డబ్బుకు అంగలార్చుతుంటే.. వీరు కాంక్రీట్ జంగిల్లో విందు వినోద విలాసాల మధ్య చేరి ఇటు మీడియా, అటు జ్యుడిషియరీని ఎలా మాన్యు ప్లేట్ చేస్తుంటారు ? సరిగ్గా అదే సమయంలో హవాలా రూపంలో డబ్బును ఎలా సంపాదిస్తుంటారో తెలియ చేస్తుందీ చిత్రం.
అంతే కాదు అంతటి దండకారణ్యంలోకి భారీ ఎత్తున విధ్వంస సామాగ్రిని ఎలా పోగు చేస్తారు?
వారికి అంతటి ఆయుధ సామాగ్రీ చేర వేసేవారెవరు? వంటి ఎన్నో అంశాలను కూడా ఈ సినిమా ఎత్తి చూపుతుంది. ఇందులో ఒక పాయింట్ బాగా మెలిపెడుతుంది. ఇదంతా రెండు పేద వర్గాల మధ్య సాగే సంకుల సమరం. ఇక్కడ గెలిచేదీ, ఓడేది- ప్రాణాలో తీసేది, పోగొట్టుకునేదీ పేదవారే. ఈ మొత్తం రక్త సిక్త నాటకాన్ని పై నుంచి నడిపించేది ధనిక వర్గమే. ఇక్కడ పోలీసు ప్రాణం తీసేది ఒక పేద నక్సలే. అదే సమయంలో కూంబింగ్ ఆపరేషన్లో.. పోలీసులు కాల్చి చంపేదీ పేద నక్సలైట్ నే.
రాజేంద్ర కర్మ అనే సల్వా జుడం అగ్ర నేతను మట్టు పెట్టిన సమయంలో.. నక్సలైట్లు అతడి శరీరాన్ని తూట్లు పొడవటం మాత్రమే కాదు.. ఆ రక్త సిక్తమైన మృతదేహాన్ని అడవుల్లోకి లాక్కేళ్తూ చేసే వికృత విన్యాసం..నక్సలిజంలో ఉన్న మంచి ఏమిటో మనకు అర్ధమే కాదు.. పైపెచ్చు ప్రతి నక్సలైటూ.. ఒక విధ్వంస కారుడే.. రక్త దాహంతో ఉర్రూతలూగుతూ ఉండేవాడే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బస్తర్ నక్సల్ నాయకుడైన లంకరెడ్డి అత్యంత క్రూరుడిగా కనిపిస్తాడు. ఇతడికి అమాయకుల ప్రాణాలంటే అలుసు- ఆడపిల్లల మానమంటే చాలా చాలా ఇష్టం- ఇక ఇరవై నాలుగ్గంటలూ ధన దాహంతో అలమటిస్తుంటాడు. ఇలాంటి వాళ్ల కోసమా మనం జన బాహుళ్యంలో చేరి ఆవేదన వ్యక్తం చేసేది? అన్న ప్రశ్న ఉదయించక మానదు.
ఇక ఇదే సినిమా ద్వారా మరో పాయింట్ కూడా చర్చకు వస్తుంది. అదేంటంటే.. కోర్టులు ఎప్పుడూ హ్యూమన్ రైట్స్ ముసుగులో.. నక్సలైట్లకే సపోర్టునిస్తుంటాయి. ఈ విషయంలో పోలీసు న్యాయవాది పాత్ర తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. సల్వా జుడుం.. పై నిషేధం విధించే సమయంలో.. ఎంతో గొప్ప ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ.. ఆలోచింప చేస్తుందీ కేరెక్టర్. మొత్తం మీద ఈ సినిమా ద్వారా.. మనకేం అర్ధమవుతుందంటే.. నక్సలైట్లు.. మనకు పైకి కనిపించచేంత మంచి వాళ్లు కారని. అసలు వాళ్లు సామాన్యుల కోసం పోరాడుతున్నట్టు కనిపించే.. విపరీత మానసిక ధోరణితో కూడుకున్న వారనీ. శారీరక వాంఛలతో రగిలిపోయేవారనీ. అంతులేని ధనాశతో కనిపించేవారనీ.. తెలుస్తుంది.
రత్న అనే బాధిత పోలీసు అధికారిణి..తన భర్తను లంకరెడ్డి ఎలా గొడ్డలితో నరికి చంపాడో.. సరిగ్గా అలాగే అతడ్ని హతమార్చడం అనే ప్రక్రియతో ఈ సినిమా క్లైమ్యాక్స్ రక్తి కడుతుంది. అదా శర్మ తనకు తెలిసిన మేరలో మంచి నటనే చేసింది. కేరళ స్టోరీ ద్వారా అనుకుంటా.. ఆమె ఈ సినిమాలో ప్రధాన పాత్ర నీరజకు ఎంపికైనట్టుంది. తనలో సోకాల్డ్ బాలీవుడ్ అందాల ఆరబోత అనే డిస్ క్వాలిఫికేషనే.. ఆమెకు ఇలాంటి పాత్రలు రావడానికి మెయిన్ క్వాలిఫికేషన్ గా మారుతున్నట్టు తెలుస్తోంది.
ఇదండీ సుదీప్తో సేన్ రూ. 15 కోట్ల బడ్జట్ తో తీసిన బస్తర్. ఇక్కడ పదే పదే ఈ చిత్ర దర్శకుడ్నే ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. అంత పకడ్బందీగా ఇతడు అల్లుకున్న కథ. దాన్ని నడిచిపించిన తీరు తెన్నులే కారణం.. ఇందుకు.. ప్రధాన పాత్రల్లో చేసిన నటీ నటులు కూడా ఎంతో గొప్ప సహకారం అందించిన మాట కూడా అంతే వాస్తవం !!! హేట్సాఫ్ సుదీప్తో టీం. మాకెన్నో విషయాలను కనులకు కట్టించినుందుకు బహుత్ బహుత్ ధన్యవాద్…