విశాఖపట్నం : ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ అమర్‌నాథ్
రాష్ట్ర ఆర్థికస్థితిపై యనమల అసత్య ప్రచారం, మంత్రిగా రాష్ట్రానికి యనమల ఆర్థిక అన్యాయం, ఇప్పుడు వాటన్నింటినీ మాపై నెట్టే ప్రయత్నం, రాష్ట్ర మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్ వెల్లడి, టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు, మేము చేసిన అప్పులన్నీ పూర్తిగా సద్వినియోగం, పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసమే వ్యయం, అయినా వాటిపై అంతులేని దుష్ప్రచారం, కానీ మీరు ఎందుకు అప్పు చేశారో చెప్పగలరా?, యనమలకు మంత్రి అమర్‌నాథ్ సవాల్.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పరిశ్రమలపై మీరు మాట్లాడొద్దు, ఆ నైతిక హక్కు మీకు ఏ మాత్రం లేదు, బల్క్ డ్రగ్ పార్కు కూడా వద్దంటున్నారు, మీకు రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు, ప్రెస్‌మీట్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టీకరణ.
ఆ తప్పులు మాపై నెడుతున్నారు:
మండలిలో ప్రతిపక్ష నేత, టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపైనా, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగంపైనా ఏదేదో మాట్లాడారు. తనకు తాను మేధావిగా యనమల ఊహించుకుంటారు. ఆరోజు ఎన్టీ రామారావును పదవి నుంచి దింపడంలో చంద్రబాబుకు మించిన పాత్ర యనమల రామకృష్ణుడిది. చివరకు ఆయనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. యనమల రామకృష్ణుడు దాదాపు 10 ఏళ్లు ఆర్థిక మంత్రిగా పని చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా యనమల చేసిన ఆర్థికపరమైన అన్యాయాలు, రాష్ట్రానికి చేసిన అన్యాయాలు మర్చిపోయి, వాటన్నింటినీ మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నాడు మితిమీరి అప్పులు:
2014లో విభజన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన అప్పులు రూ.1.20 లక్షల కోట్లు. 2019లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.2.80 లక్షల కోట్లు. అంటే ఆ స్థాయిలో అప్పు చేసినా, దేని కోసం ఖర్చు చేశారన్న దానికి లెక్కలు లేవు. అయినా ఇప్పుడు మేమే అప్పులు చేస్తున్నట్లు విమర్శిస్తున్నారు. వారికి మమ్మల్ని నిందించే నైతిక అర్హత లేదు.
ఇదే మా సవాల్:
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడున్నర ఏళ్లలో చేసిన అప్పు రూ.1.10 లక్షల కోట్లు మాత్రమే. అయితే గత మూడేళ్ల పరిస్థితి. మీ హయాంలో 5 ఏళ్ల పరిస్థితిని బేరీజు వేయరా? ఆనాడు కరోనా వంటి మహమ్మారి లేదు కదా? అప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు కదా? కానీ ఈ మూడేళ్లలో ఎన్నో పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి.
పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అప్పులు చేయాల్సి వచ్చింది. అవన్నీ మేము చెప్పగలం. మరి మీరు చేసిన రూ.1.60 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పగలరా? నేను సవాల్ చేస్తున్నాను. మీరు చేసిన అప్పులు ఎవరికీ ఉపయోగపడలేదు. మీరు దోచుకోవడం కోసమే ఆ అప్పులు చేశారు. ఇంకా అంటున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) సక్రమంగా అందితే, రాష్ట్రంలో పేదరికం ఎందుకు ఉంటుంది? అంటున్నారు.
గడచిన మూడు సంవత్సరాల మూడు నెలల్లో పేదలకు సంక్షేమం కింద అందించిన మొత్తం రూ.1.75 లక్షల కోట్లు. అది నేరుగా ప్రభుత్వం నుంచి పేదల ఖాతాల్లో పలు పథకాల కింద జమ అయింది. రాష్ట్రంలో నెలకు దాదాపు 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. అందుకోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ స్థాయిలో మరే రాష్ట్రంలో అంత ఖర్చు చేయడం లేదు.
స్వయం ప్రకటిత మేధావి, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా అప్పులు చేశారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, ఏవీ నెరవేర్చలేదు. రైతులు, మహిళలను మోసం చేశారు. మరి ఆరోజు మీరు రూ.1.60 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారో చెప్పండి. కానీ మేము అప్పులు ఎందుకు చేశామన్నది చెప్పగలం. మేము పేదల ఖాతాల్లో నేరుగా రూ.1.75 లక్షల కోట్లు జమ చేశాం. అందులో ఒక్క రూపాయి అవినీతి జరిగిందన్నది చెప్పగలరా? అనర్హులకు కూడా అవి అందలేదు. ఆరోజు మీరు ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే. అలాగే ఆరోజు ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు.
ఆ పార్క్‌నూ వ్యతిరేకిస్తారా?:
ఇవాళ మీరు మేధావిగా భావించుకుంటూ, ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. మీరు ఉండేది హైదరాబాద్‌లో. ఇక్కడి పరిస్థితులు మీకు తెలియదు. రాష్ట్రంలో పరిశ్రమల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఇక్కడ మంజూరైన కేంద్ర ప్రభుత్వ రూ.1000 కోట్ల ప్రాజెక్టు బల్క్ డ్రగ్ పార్క్. దీని కోసం అన్ని రాష్ట్రాలు పోటీ పడితే, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌తో పాటు, మన రాష్ట్రాన్ని ఎంపిక చేశారు. అందు కోసం మన పాలసీని మెచ్చుకున్నారు కూడా. ఆ పార్కు వల్ల దాదాపు 40 వేల ఉద్యోగాలు వస్తాయనుకుంటే, ఆ పార్కు వద్దని కేంద్రానికి లేఖ రాస్తారా? మరోవైపు రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని కూడా మీరే విమర్శిస్తున్నారు. ఆ మేరకు సీఎంగారికి లేఖ కూడా రాశారు. మీకేమైనా మతిమరుపు వ్యాధి వచ్చిందా? ఈఓడీబీ ర్యాంక్ వస్తే ఏం లాభం అంటున్నారు. మరి అది ఎందుకు ఇస్తున్నారు. ఆ విషయం మీకు తెలియదా? అన్నీ పరిశీలించాకే ఈఓడీబీ ర్యాంక్ ఇస్తారు కదా?
మీ హయాంలో అంతా మోసమే:
రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఇక్కడి పరిస్థితి గుర్తించారు. కానీ మీరు మాత్రమే గుర్తించడం లేదు. మీరు రూ.16 లక్షల కోట్ల ఎంఓయూలు చేసున్నామని చెబుతున్నారు. వారెవరో చెప్పండి. చూపండి. ఎవరెవరికో సూటు, బూటు వేసి ఒప్పందాలు చేసుకున్నారు. దాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టే, మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టారు.
మా సీఎంగారు ఒకటే చెబుతారు. వాస్తవాలనే చెప్పాలని. ఎంత పెట్టుబడి వస్తే అంతే చెప్పాలని, అబద్ధాలు చెప్పొద్దని ఆయన చెబుతారు.
మీరు విశాఖలో సదస్సు పెట్టి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. కానీ అన్నీ మోసాలే. ఏదీ కార్యరూపం దాల్చలేదు. పెట్టుబడులు రాలేదు. ఉద్యోగాలు అంత కంటే రాలేదు. మా ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుంటే, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావొద్దన్నది మీ కుట్ర. అందుకే పదే పదే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.
తప్పు చేసి బీసీ అంటే ఎలా?:
అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే, కేసు పెడితే బీసీలపై కక్ష అంటున్నారు. అంటే తప్పుకు, కులానికి ఏమిటి సంబంధం? బీసీలపై కుట్ర అని ఎల్లో మీడియాలో రాయిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే. చట్టం ముందు అందరూ ఒకటే కదా? అలాంటప్పుడు బీసీ అని చెప్పడం ఎందుకు?
అయ్యన్నపాత్రుడు అక్రమం అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇవాల స్వయం ప్రకటిత మేధావి మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడారు. ఆయనకు పన్ను నొప్పి వస్తే, సింగపూర్‌లో లక్షల రూపాయలతో ట్రీట్‌మెంట్ చేయించుకున్న ఆయనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడే హక్కు లేదు. మేము చేసిన అప్పు కేవలం పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది కోసమే చేశాం. కావాలంటే దానిపై మేము చర్చకు కూడా సిద్దంగా ఉన్నాం.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
మీకు చిత్తశుద్ధి లేదు:
పర్యావరణ అనుమతులకు సంబంధించి కేంద్రం ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తుందో అందరికీ తెలుసు. అన్నీ చూసే కదా, కేంద్రం మనకు బల్క్ డ్రగ్ పార్క్ మంజూరు చేసింది. మరి అలాంటప్పుడు ఆ పార్కు వల్ల రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువ అవుతుందని యనమల ఎలా విమర్శిస్తున్నారు? జీరో లిక్విడ్ డిశ్చార్జ్‌తో ఆ పార్కు ఏర్పాటవుతుంది. అవన్నీ కేంద్రానికి కూడా తెలుసు.
పర్యావరణం కాపాడతాం. ప్రజల ఆరోగ్యం కాపాడతాం. ప్రభుత్వానికి అన్నీ తెలుసు. బల్క్ డ్రగ్ పార్కు వల్ల దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాదాపు 40 వేల ఉద్యోగాలు వస్తాయి. ఆ పార్కు వల్ల నష్టం జరిగితే, దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలు ఎందుకు పోటీ పడ్డాయి? పొరుగున తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు కదా?
మన రాష్ట్రం మిగిలిన ప్రాంతాలతో పోటీ పడి సాధించుకున్న ప్రాజెక్టు బల్క్ డ్రగ్ పార్క్. దాన్ని పొల్యూషన్ పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారు. మీకు రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రజల శ్రేయస్సు మీద, భవిష్యత్తు మీద చిత్తశుద్ధి లేదు.
అప్పుపై విష ప్రచారం:
రూ.8 లక్షల కోట్ల అప్పులు అంటున్నారు. ఇది అవాస్తవం. వారి సొంత గజిట్ పేపర్ ఈనాడులో రెండు నెలల క్రితం రాశారు. ప్రభుత్వం రూ.1.10 లక్షల కోట్లు అప్పు చేసిందని రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు అది మాత్రమే. దాని కంటే మేము ఎక్కువ అప్పు చేశామంటున్నారు. దాన్ని చూపండి. మేము ఎందుకు అప్పు చేశామన్నది చూపుతాం. కానీ వారు ఎందుకు అంత అప్పు చేశారో చెప్పమనండి. అదానీ గ్రూప్‌నకు దాదాపు 139 ఎకరాలు ఇచ్చాం. జీఓ విడుదల చేశాం. భూమి కూడా కేటాయించాం. ఆ ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన కూడా జరగబోతున్నది.
మీ పాలనలో ఏం చేశారు?:
మేము అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల 5 నెలలు మాత్రమే. అదే తెలుగుదేశం పార్టీ దాదాపు రెండు దశాబ్దాలు అధికారంలో ఉంది. మరి వారు రాష్ట్రానికి దీర్ధకాల ప్రణాళికలు ఏం రూపొందించారు.
చివరకు 2014 నుంచి 2019 వరకు దారుణంగా పాలించారు కాబట్టే, ప్రజలు తమ తీర్పు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అంతులేని అవినీతి. మేము అధికారంలోకి వచ్చాక, కోవిడ్ వంటి తీవ్ర సమస్య వచ్చింది. దాంతో అనివార్యంగా అప్పు చేయాల్సి వచ్చింది. మరి వారు ఎందుకు అంత అప్పు చేశారో చెప్పమనండి. శ్రీసిటీ సెజ్, కియా కంపెనీ.. వాటన్నింటికీ పునాది వేసింది వైయస్సార్‌గారు. ఆయన ప్రయత్నం, చొరవ వల్లనే అవన్నీ ఏర్పడ్డాయి. కానీ ఏది జరిగినా ఆ క్రెడిట్ తీసుకోవడం తెలుగుదేశం పార్టీ నేతలకు అలవాటు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టే, పక్కన పెట్టారు.
ఆ అవసరం మాకు లేదు:
విశాఖ గర్జన తర్వాత సినిమా స్టైల్‌లో పవన్ వ్యవహరిస్తున్నారు. ఆ స్క్రిప్ట్ చంద్రబాబు ఇస్తున్నారో.. ఎవరు ఇస్తున్నారో తెలియదు. పవన్‌పై రెక్కీ చేయాల్సిన అవసరం మాకేముంది? ఆయనకు వీకెండ్‌లో షూటింగ్‌కు సెలవు కాబట్టి, ఇవాళ ఇప్పటం వచ్చాడు. మళ్లీ రాజకీయం చేసి వెళ్లాడు. ఇప్పటంలో ఆయన సభ పెట్టుకుంటే, స్థలం ఇచ్చారని ప్రభుత్వం కక్ష సాధిస్తుందా? గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ఎప్పుడో పనులు మొదలుపెట్టారు. మార్కింగ్ చేశారు. నోటీసులు కూడా ఇచ్చారు. దాన్ని తప్పు పడుతున్న పవన్, ప్రభుత్వంపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు.
పవన్ గురించి ఆలోచించే సమయం కూడా మాకు లేదు. పవన్‌పై అసలు రెక్కీ జరగలేదు. దాన్ని తెలంగాణ పోలీసులు తేల్చారు. ఎవరిపైనా కక్ష సాధించబోం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయ్యన్నపాత్రుడు కూడా తప్పు చేశాడు కాబట్టే, కేసు పెట్టారు. అంతే తప్ప ఏ విధంగానూ కక్ష సాధింపు కానే కాదు.