Ayyanna Patrudu : మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. దాదాపు 10 సంవత్సరాలకు పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జలవనరుల శాఖకు చెందిన 0.16 సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ అయ్యన్న పాత్రుడుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయగా… తనపై నమోదైన భూ ఆక్రమణ కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను బుధవారం నాడు హైకోర్టు విచారించింది.
ఈ కేసు విషయంలో అయ్యన్నపాత్రుడిపై సీఐడీ విచారణ కొనసాగించుకోవచ్చు కానీ… సెక్షన్ 467 వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పింది. జలవనరుల శాఖ అధికారులు ఇచ్చిన ఎన్‌ఓసీ విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం నడుచుకోవాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌పీసీలోని 41 ఏ కింద అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అయ్యన్నపాత్రుడిపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరుపు న్యాయవాది వీవీ సతీష్ హైకోర్టును ఆశ్రయించారు.
తన క్లెయింట్‌పై ఉద్దేశ పూర్వకంగానే సెక్షన్ 467 నమోదు చేశారని… ఈ కేసులో సెక్షన్ 467 చెల్లదని అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మరోవైపు సీఐడీ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ అయ్యన్నపై ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను బెదిరించడం, భయపెట్టడం వంటివి చేశారని… అందుకే సెక్షన్ 467 వర్తిస్తుందని చెప్పారు. గతంలో విశాఖ కోర్టు అయ్యన్నపాత్రుడిని రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.