బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క 24 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించుకొన్నారు. హాస్పిటల్ ఆవరణలోని ఆడిటోరియంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవ్వగా శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI మరియు హిందుపురం శాసనసభ్యులు, ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ వారు అధ్యక్షత వహించారు.
సాంప్రదాయ రీతిలో కార్యక్రమానికి హాజరైన ఆహూతుల ద్వారా జ్యోతి ప్రజ్వళనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా డా. కె కృష్ణయ్య, CEO, BIACH&RI వారు సభకు హాజరైన వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా. కె కృష్ణయ్య మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క ఆవిర్భావం తదుపరి పయనాన్ని వివరించారు. హాస్పిటల్ ద్వారా నేటి వరకూ అందించిన చికిత్స వివరాలు, నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపునకు చెందిన సమాచారం కార్యక్రమానికి హాజరైన వారి ముందుంచారు. ముఖ్యంగా హాస్పిటల్ కు చెందిన ల్యాండ్ లీజు పొడిగింపు అందించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం కార్యక్రమంలో శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI వారు మాట్లాడుతూ… అడిగిన వెంటనే పెండింగ్ లో ఉన్న ల్యాండ్ లీజు పొడిగింపు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. హాస్పిటల్ భాద్యతలు చేపట్టడం తన పూర్వ జన్మ సుకృతమని తండ్రిగారి వారసత్వాన్ని కొనసాగించడంలో ఎటువంటి లోటు లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. హాస్పిటల్ నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎందరో దాతలు తమ సహాయ సహకారాలు అందించారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హాస్పిటల్ మీద నమ్మకంతో ప్రభుత్వాలు కూడా తమకు సహాయం చేస్తున్నదని ఈ నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా తాము పని చేస్తామని చెప్పారు. సంస్థ ఎలాంటి వివక్ష లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తన సేవలు అందిస్తుందని త్వరలోనే హాస్పిటల్ సేవలను మరింత ఎక్కువ మందికి చేర్చడానికి విస్తరిస్తున్నామని అందుకు ప్రభుత్వం నుండి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
చివరగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ… ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ ఈ ఆసుపత్రి 24ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషం. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారన్నారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారన్నారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా మా ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పని చేసే అవకాశం నాకు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొంటూ అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోందని అక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుందని తద్వారా సంస్థ విస్తరణకు అవకాశం ఉంటుందన్నారు. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్ కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన వారసులకు రాజకీయం, సంక్షేమం వారసత్వంగా ఇచ్చారని పేర్కొంటూ ఎన్టీఆర్ కుటుంభంలోని మూడో తరం కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని వారు ఇందులో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ కు గత ఆర్థిక సంవత్సరంలో పలు కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించి దాతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్, దివ్య శక్తి ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, అంకుర్ ప్రాజెక్టులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జన ఛైతన్య హవుసింగ్ ప్రయివేట్ లిమిటెడ్, టయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ లిమిటెడ్, లియోపిలిజేషన్ సిస్టం ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, కోర్ కార్భన్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థల ప్రతినిథులను మెమోంటోలు అందించడం ద్వారా సత్కరించారు.
కార్యక్రమంలో చివరగా శ్రీ నందమూరి బాలకృష్ణ తో పాటూ ఇతర ట్రస్టు బోర్డు సభ్యులు వేదోఛ్చారణల మధ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శాలువా కప్పి, జ్ఞాపికను అందించి ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం శ్రీ యం శ్రీ భరత్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI మరియు విశాఖ పట్నం పార్లమెంటు సభ్యులు వందన సమర్పణ చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనను పాటిస్తూ సేవా రంగంలో విస్తృతంగా పని చేయడానికి కృషి చేస్తామని అన్నారు.
జాతీయ గీతాలాపతో BIACH&RI 24 వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం ముగిసింది. తదుపరి ఇటీవల పుట్టిన రోజు జరుపుకొన్ని శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హాస్పిటల్ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను భోజనాంతరం కొనసాగాయి.