Allu Arjun : పలువురు సినీ ప్రముఖులు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోలమని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. వారి అభిమానులకు లేదా ఆపదలో ఉన్నవారిని ఆడుకోవడానికి తమ మంచి మనసును చాటుకుంటూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు. బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలనుకుంటున్న విద్యార్ధినికి అండగా నిలబడ్డారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ సాయం చేసిన విద్యార్ది కేరళ అమ్మాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే… కేరళకు చెందిన అమ్మాయి. నర్సింగ్ కోర్సు చేయాలనుకుంది. ఇంటర్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులను కూడా సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆ అమ్మాయికి ఉన్నత చదువులకు డబ్బులు పెట్టలేని పరిస్థితి. దీంతో విషయం తెలుసుకున్న అలప్పుర కలెక్టర్ వి.ఆర్.కృష్ణ తేజ తన ఫేస్ బుక్ ద్వారా అల్లు అర్జున్‌కి విషయాన్ని తెలియజేశారు. నర్సు కావాలనుకున్న అమ్మాయికి ఓ ప్రైవేటు కాలేజీలో సీటు దక్కింది. కానీ ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ఎవరైనా అండగా నిలబడితే బావుంటుందని ఎదురు చూశారు.
దీంతో కలెక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని సంప్రదించి విషయాన్ని తెలియజేశారు. అల్లు అర్జున్ వెంటనే ఓ ఏడాది కాదు… నాలుగేళ్ల పాటు అమ్మాయి చదువు, హాస్టల్ ఫీజులకు కావాల్సిన సాయాన్ని చేయడానికి అంగీకరించారని సమాచారం. దీంతో సోషల్ మీడియా వేదికగా జిల్లా కలెక్టర్ హీరో అల్లు అర్జున్‌కి ధన్యవాదాలను తెలియజేశారు. ఇప్పుడా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఆమె తండ్రి గత ఏడాది కరోనా కారణంగా కన్నుమూశారు.