Allu Aravind : వరుణ్ ధావన్, కృతిససన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేదియా. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్‌తో ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘బాహుబలి సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేసాం. మంచి సినిమాను ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్ గా మారింది అని తెలిపారు.
వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం. ఈ సినిమాలో కొంత భాగం చూసే అవకాశం నాకు కలిగింది. ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు ఉన్నాయి అన్నారు. అలానే ఈ సినిమాను ప్రమోట్ చెయ్యడానికి చిరంజీవి గారు వస్తాను అన్నారు. కానీ ఆయనకు ఒక కాంబినేషన్ లో షూటింగ్ ఉండడంతో రాలేకపోయారు.
ఈ సినిమాను తెలుగులో విడుదలచేయడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నానన్నారు. సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అవి జనాలను ఎంటర్‌టైన్ చేస్తున్నాయని.. సినిమాలో కంటెంట్ బాగుంటే, ఏ భాష సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. తెలుగు నిర్మాతల మండలి లేఖపై తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఈ నెల 22న తమిళ నిర్మాతలు ఈ విషయంపై చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.