Allu Aravind : తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. అలాగే బన్నీ వాసు నేతృత్వంలో గీత ఆర్ట్స్-2 ను ప్రారంభించి నూతన దర్శకులను ప్రోత్సహిస్తూ, చిన్న సినిమాలతో కూడా మంచి హిట్ లను సొంతం చేసుకుంటున్నారు. తన తండ్రి అల్లు రామలింగయ్య గారికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతగా అరవింద్ దూసుకుపోతున్నారని చెప్పాలి. కాగా ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల సందర్బంగా ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహిస్తోన్న ” అలీతో సరదాగా షో “కు అతిథిగా విచ్చేసిన ఆయన మొదటి భాగంలో అనేక విషయాలను పంచుకున్నారు.
ఇక ఇప్పుడు రెండో భాగంలోనూ మరికొన్ని విషయాలు చెప్పారు. ఈ నేపథ్యం లోనే తన మనసులోని కోరికను బయటపెట్టారు. తన కొడుకు అల్లు అర్జున్, మేనల్లుడు రామ్ చరణ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ ని తెరకెక్కిచాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి “చరణ్-అర్జున్” అనే టైటిల్‌ను కూడా గతంలోనే రిజిస్టర్ చేసినట్లు వెల్లడించాడు. అయితే వీరి కాంబోలో మూవీ తెరకెక్కించడానికి సరైన కథ, సత్తా ఉన్న దర్శకుడు దొరక్క ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని అన్నారు. ఎప్పటికైనా ఆ కల నెరవేరకపోదాని… అందుకే ఆ టైటిల్ ని ప్రతి ఏడాది రెన్యువల్ చేయించుకుంటూ వస్తున్నానని తెలిపారు.
ఇక చరణ్, బన్నీ “ఎవడు” అనే సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం చరణ్, బన్నీ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్‌గా దూసుకుపోతున్నారు. ఓవైపు అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 చేస్తుండగా… రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ రాబోతుందనే వార్తతో మెగా ఆడియన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు.