Ali : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నటుడు అలీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలీ… టాలీవుడ్ లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా రాజకీయాలలో కూడా అప్పుడప్పుడూ పాల్గొంటూ వస్తున్నారు. అలీ గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టీవ్‌గా ఉండేవారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్య పరిచారు. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అది కుదరకపోవడంతో… వైసీపీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ చేత ప్రచారం చేయించింది వైసీపీ. దీంతో పార్టీ అధికారంలోకి వస్తే అలీకి మంచి పదవి ఖాయం అంటూ అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. కానీ మూడేళ్లు గడుస్తున్నప్పటికి పదవి ఇవ్వకపోవడంతో అలీ చాలా డిజప్పాయింట్ గా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్‌తో ఆయనకు ఉన్న స్నేహం కారణంగా జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలోనే అలీకి వెంటనే ఈ పదవి కట్టబెట్టినట్లు రాజకీయంగా టాక్ నడుస్తుంది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అలీ వైసీపీలో చేరిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన నటించిన సినిమా కూడా రిలీజ్ కానుంది. అదే విధంగా ఈటివి ఛానల్ లో అలీతో జాలీగా అనే టాక్ షో ద్వారా కూడా అలీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.