యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశం దుబాయి లోని బర్ దుబాయి ప్రాంతంలో తెలంగాణ గల్ఫ్ ప్రవాసులు సెలవు రోజైన ఆదివారం రాఖీ పండుగ సమూహంగా జరుపుకున్నారు. అబుదాబి లో నివసించే వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రియా సింగిరెడ్డి గత నాలుగేళ్లుగా 200 రాఖీలు దుబాయి లోని ప్రవాస సోదరులకు బహుమతిగా పంపేవారు. ఈసారి స్వయంగా తన భర్త వెంకట్ రెడ్డి, కుమారుడు ధీరజ్, కుమార్తె దీక్షిత లతో కలిసి దుబాయికి వచ్చి 250 మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులకు రాఖీలు కట్టారు.
కుటుంబానికి దూరంగా సుదూర దేశాలలో ఉన్న కార్మిక సోదరులు తమ సాంప్రదాయ పండుగలను జరుపుకోవడం వలన ఉల్లాసాన్ని పొందుతారని, సామూహిక జీవనం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని ప్రియ సింగిరెడ్డి ఈ సందర్బంగా అన్నారు. గల్ఫ్ దేశాలలో మన కార్మికుల ఆత్మహత్యల నివారణకు అందరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ శంకర్, కోరేపు మల్లేష్, మోతె రాములు, బొల్లి కుమార్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పరాయి దేశంలో తమ ఆడపడుచుతో రాఖీ కట్టించుకోవడం ఎంతో సంతోషకరమని దేశవేని శంకర్, మోతె బాబు, కిషన్, కుమార్ ఎగుర్ల, జెడ మల్లేష్, తిరుపతి, నందు, లక్ష్మణ్, కిషన్, సుమంత్, రాము కటకం అన్నారు. రాఖీలు కట్టిన ప్రియా సింగిరెడ్డికి వారు పట్టు చీరను, ఆమె భర్త వెంకట్ రెడ్డికి శాలువాను బహుకరించారు.