అదేం టీవీ స్వామి? ఆయన జైల్లో ఉన్నా ఎవ్వడు రోడ్ల మీదకు కూడా రావడం లేదని చెబుతున్నాడు! బంద్ అన్నారు…షాపులు అన్నీ ఖుల్లా అంటున్నాడు! ఆ టీవీ ఓనరేగా కింగ్ మేకర్ ! 144 సెక్షన్ పెట్టి, చిన్న పెద్ద నాయకులను హౌస్ అరెస్ట్ చేయించింది వాళ్లే! ఎట్లాగో చచ్చి చెడి ధైర్యం చేసి వచ్చిన వాళ్ళ వీపులు పగులుతున్నాయి! అన్నీ తెలిసి కూడా ఎవ్వరూ రావడం లేదు స్పందన లేదు అని చెప్పేది వాళ్లే! ఇంకెందుకు మరి 144 ఎత్తేయచ్చుగా! నాయకులను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసుల బందోబస్తు ఎందుకు? ఎందుకు అంటే ముందస్తు భద్రత అనే ముచ్చటయిన మాట!
అప్పట్లో ఆర్ధిక శాఖ కార్యదర్శి గా పని చేసినాయన అప్రూవర్ గా మారారని, ఆయన చెప్పిన ఆధారాలతో పెద్దాయనను అరెస్ట్ చేశామని వీళ్ళు చెబుతున్నారు! ఇదంతా చూసిన ఆ రిటైర్డ్ ఆఫీసర్ గారు ఇదొక పెద్ద జోక్ అనేశారు ప్రెస్ మీట్ పెట్టి మరీ! తానసలు అప్రూవర్ గా మారలేదన్నాడు! తన మాటలను వక్రీకరించారని ఆయన చెప్పేశాడు! వెంటనే సంబంధిత అధికారులు ఓసోస్ అదొక్కటే కాదు, ఇంకా వేరే ఆధారాలు కూడా ఉన్నాయని కౌంటర్ కూడా ఇచ్చేసారు! మొత్తానికి రెడీ గా ఉన్నారు!
కక్ష శిక్ష అని ఎవరైనా అనుకుంటే హాస్యాస్పదం! అతను తలచుకుంటే ఇన్నేళ్లు ఎందుకు ఆగుతాడు? అధికారం లోకి రాగానే ప్రజా వేదిక కన్నా ముందు కరకట్ట మీద ఆయనున్న ఇంటిని కూల్చి ఆయన్ని జైల్లో పెట్టించేవాడు! ఆయన అయినా, వార్డు మెంబర్ కూడా కాని ఆయన కొడుకు అయినా మాకు పోటీయే కాదు! 175 సీట్స్ లో వాళ్లకు అభ్యర్దులే లేరు! వాళ్ళను లోపలేసి టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాం? మా దృష్టి అభివృద్ధి సంక్షేమం పైనే అని సకల షాడో మంత్రి స్పష్టం చేసేశాడు! కానీ పర్యాటక మంత్రి మాత్రం టపాసులు కాల్చి పండగ చేసుకుంది! ఇంకా ఏడు కేసులు ఉన్నాయి, బయటకు రాగానే మళ్ళీ లోపలే వేస్తాం అని ఆమె చెప్పేసింది! పదేళ్లకు కూడా బయటకు వచ్చే సమస్యే లేదని ఆడిటర్ ఎంపి కూడా తేల్చేశాడు!
కేంద్రం తమాషా చూస్తోంది! రింగులో చివరి వరకు ఎవరు ఉంటే వాళ్లే వారికి కావాలి! అప్పటి వరకు అట చూస్తూనే ఉంటారు ! అవును మరి ఇక్కడోళ్లకు లోకల్ కుర్చీ ఎంత ముఖ్యమో అక్కడ ఢిల్లీ పీఠం అంత ముఖ్యం అని వాళ్ళు కూడా తేల్చి పడేసారు!
ఆయన పెద్దాయన! ఆయనకు జైల్లో వున్న ఖైదీల వల్ల ప్రాణ హాని ఉంది, ఆయన వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా గృహ నిర్భంధం గా మార్చమని ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది మొత్తుకుంటున్నాడు! ఆయన బాధ ఆయనది! మీటర్ గిర్రున తిరుగుతోంది, పాపం ఫలితం సున్నా! ఆమెకేమో ఫోన్ ప్రాబ్లమ్! లండన్ ఢిల్లీ లైన్లు బిజీ! అందుకే తీర్పు వాయిదా వేసి పడేసింది!
మొత్తానికి కేసు బలంగానే ఉంది! ఆధారాలు పటిష్టంగానే ఉన్నాయి! ప్రభుత్వం పక్షాన ఇంత టఫ్ ఫైట్ చేస్తున్నారు అంటే సిఐడి టీమ్ ను అభినందించాల్సిందే! నిజానికి ప్రభుత్వాలు మారినప్పుడు సుపరిపాలన అందించి తిరిగి ఎన్నికై అధికారం లోనే ఉండాలని కష్టపడుతుంటారు సహజంగా! ఇతను మాత్రం వచ్చినప్పటి నుంచి తవ్వుతూనే ఉన్నాడు! తవ్వడం మంచిదే! అంతకు ముందు ముఖ్యమంత్రులుగా వెలగ బెట్టిన వాళ్ళ ఫైల్స్ కూడా తవ్వితే మంచిదే! ఈ లెక్కన ఎవ్వరికీ క్లీన్ చిట్ ఉండదు! అందరూ దొంగలే! కానీ, ఇతను అలా కాదే! ఒక్క పెద్దాయన చుట్టూ తిరుగుతున్నాడు!
నాకు గురివింద సామెత గుర్తుకోస్తోంది…ఆంధ్రప్రదేశ్ లో ఒకళ్ళను ఒకళ్ళు తిట్టుకుంటుంటే! అతను బెయిల్ మీదే ఉన్నాడు! ఇప్పుడు ఈయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు! వచ్చాక ఇద్దరూ జైలు రిటర్న్ లే! ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్పోళ్ళు! వాళ్ల కు సహనం ఎక్కువ! రాష్టం ఎటు పోయినా పరవాలేదు, అకౌంట్ లోకి వచ్చిందా లేదా? తింటే తినండి, మాకూ పెట్టండి అంటున్నారు! రాష్టం ఎటు పోయినా ఓకే ఓకే!
ఏది ఏమైనా ముఖ్యమంత్రి ని మెచ్చుకోవాలి! ఆర్ధిక ఇబ్బందుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతూనే గడప గడప కు డబ్బులు పంచుతూనే ఉన్నాడు! అభివృద్ధి ఎక్కడ అని హైదరాబాద్ లో కూర్చుని చాలా మంది కబుర్లు చెప్పి తెగ విమర్శిస్తుంటారు! అసలు అక్కడి జనం అభివృద్ధి కోరుకోవడం లేదుగా! ఏడాదికి ఇంత ఇస్తే చాలు అంటున్నారు! జనం నాడి పట్టిన ముఖ్యమంత్రి గారు వాళ్ళు కోరిందే చేస్తున్నారు! సార్ బటన్ నొక్కినప్పుడల్లా నేను టీవీ లో ఆయన మొహమే చూస్తుంటా! భలే నవ్వుతారు ముసి ముసిగా! బటన్ నొక్కినప్పుడు మినహా ఇంకెప్పుడూ మాట్లాడరు కూడా! ఇంత జరుగుతున్నా కూడా లండన్ లో పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు! ఇంత స్థిత ప్రజ్ఞత ఎవరికి ఉంటుంది? ఒకే ఒక్క దెబ్బ కొడితే మైండ్ బ్లాంక్ అయి ముగ్గురూ చతికిల పడ్డారు! ఇప్పుడు ఇంకోసారి ఫోటో చూడండి! నో డౌట్ అబ్బ…30 ఇయర్స్ ఆయనే ముఖ్యమంత్రి!
ప్రత్యేక వ్యాసం – ఎడిటర్