AP Politics : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈనెల 9న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే చంద్రబాబుతో పాటు మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు..? కూటమి కేబినెట్ లో ఎవరికి బెర్త్ దక్కనుందనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్లతో పాటు వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపులపై పోరాటం చేయడమేకాకుండా అక్రమ కేసులు ఎదుర్కొన్న నేతలకు ప్రాధాన్యం ఉంటుందనే ప్రచారం సాగుతోంది.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, ప్రజల గొంతు వినిపించిన టీడీపీ నేతలపై వైసీపీ సర్కార్ అక్రమ కేసులు బనాయించింది. తమ రాజకీయ జీవితాల్లో మచ్చలేకుండా మెలిగిన కొందరు సీనియర్లను జైల్లో పెట్టించిందికూడా..! వైసీపీ వేధింపులను తట్టుకొని పార్టీ కోసం విధేయంగా పనిచేసిన నాయకులకు తన కేబినెట్ లో చోటివ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.
ఇందులో భాగంగా అక్రమ కేసుల ఎదుర్కొన్నవారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేతలు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పి.నారాయణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటివారున్నారు. అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కుంభకోణం పేరుతో జైలులో పెట్టి వేధించారు. అలాగే ధూళిపాళ్ళ నరేంద్ర పై ఈ ఐదేళ్లలో 16కేసులు బనాయించి రాజమండ్రి జైలులో పెట్టారు. సంగం డెయిరీని హస్తగతం చేసుకోవాలని చూసినా ఆయన ధైర్యంగా పోరాడి నిలబడ్డారు.
పైగా ధూళిపాళ్ళ నరేంద్ర 6వ సారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈసారి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొల్లు రవీంద్రపై హత్యకేసు పెట్టి జైలులో పెట్టారు. మాజీ మంత్రి నారాయణపై ఇన్నరింగ్ రింగ్ రోడ్డు కేసులు బనాయించి వేధించారు. అయ్యన్నపాత్రుడుపై పలు కేసులు బనాయించారు. వీరితో పాటు గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లోనూ గెలిచి పార్టీని విడిచిపెట్టకుండా అండగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ వంటి నేతల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి.
జిల్లాల వారీగా ప్రాధాన్యత, సామాజిక సమీకరణాల ఆధారంగా వీరికి అవకాశం కల్పించనున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నందున పైన చెప్పిన వారిలో ఎవరి మంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ కూర్పులో జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు కేబినెట్ లో స్థానం ఇవ్వాల్సి ఉన్నందున అటువైపు నుంచి కూడా పోటీ ఎదురుకానుంది.